ఆకివీడు: నిత్యం ప్రమాదాలతో సాగుతున్న జాతీయ రహదారికి ఎట్టకేలకు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఉండి పంట కాల్వను ఆనుకుని ఉన్న జాతీయ రహదారి నెం.165 చెరుకువాడ–ఆకివీడు మధ్య గతంలో పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈ రహదారి పంట కాల్వలోకి కుంగిపోవడంతో పాటు, పలుచోట్ల నెరలు తీసి బీటలువారింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు అదుపు తప్పుతుండేవి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వేగంగా వచ్చి నెరలు దీసిన రోడ్డు ప్రాంతంలో పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. గత పదేళ్లుగా ఈ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేసి జాతీయ రహదారుల అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు ఎట్టకేలకు స్పందించిన అధికారులు పంట కాల్వకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు.


