పొగాకు రైతులకు అండగా జగన్‌ | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు అండగా జగన్‌

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

దేవరపల్లి పర్యటనను విజయవంతం చేయండి

పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి చెల్లుబోయిన పిలుపు

ద్వారకాతిరుమల: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 5న దేవరపల్లి పర్యటన చేపట్టనున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఈ పర్యటన రైతులకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వేదికగా నిలుస్తుందన్నారు. జగన్‌ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ద్వారకాతిరుమల మండలంలోని పార్టీ శ్రేణులతో స్థానిక కాపు కల్యాణ మండపం వద్ద మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడుతూ, గతంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతుల సమస్యలను జగన్‌ స్వయంగా విన్నారని, వాటిపై స్పందిస్తూ ఇప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పొగాకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం, మెయిల్‌ రిజెక్షన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ను కూడా ప్రస్తుత ప్రభుత్వం వినియోగించలేదని ఆరోపించారు. రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబు స్పందించకుండా, జగన్‌ ప్రశ్నించిన తర్వాతే కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించాడని విమర్శించారు. రైతులకు అండగా నిలిచేందుకు జగన్‌ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కన్వీనర్‌ ప్రతాపనేని వాసు, దాకారపు బంగారమ్మ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, జంగా వెంకట కృష్ణారెడ్డి, గోపా నాగేశ్వరరావు, బిరుదుగడ్డ చల్లారావు, బాలం వెంకటేశ్వరరావు, చెలికాని ప్రవీణ్‌, తాండ్ర రమేష్‌, గంటా శ్రీను, ఉప్పల మునేశ్వరరావు, దాసరి రాంబాబు, దొప్పసాని రాంబాబు, బిరుదుగడ్ల బజారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement