ట్రిపుల్‌ఐటీల్లో పుస్తకాల కొరత | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీల్లో పుస్తకాల కొరత

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

నెల దాటినా పుస్తకాలు అందని వైనం

నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల పరిస్థితి దయనీయంగా మారింది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్‌లలో పాలన నానాటికీ దిగజారుతోంది. విద్యా సంవత్సరంలో భాగంగా పీయూసీ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బయాలజీ పుస్తకాలు లేకపోవడంతో నాలుగు క్యాంపస్‌లలోని 4,400 మంది పేద విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సెల్‌ఫోన్లలోనే పాఠాలు.. ఉపాధ్యాయుల తిప్పలు

పాఠాలు బోధించడానికి కనీసం అధ్యాపకుల వద్ద కూడా పుస్తకాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు ఫ్యాకల్టీ సభ్యులు బయట షాపుల్లో సొంత డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేయగా, మరికొందరు సెల్‌ఫోన్లలో పీడీఎఫ్‌ మెటీరియల్‌ చూసి బోధిస్తున్నారు. విద్యార్థులకు కూడా ఈ పీడీఎఫ్‌లనే వాట్సాప్‌లలో పంపుతుండటంతో, గంటల తరబడి సెల్‌ఫోన్‌ స్క్రీన్లను చూస్తూ చదువుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ల స్థానంలో ఇంటర్‌ పుస్తకాలు

ట్రిపుల్‌ఐటీల్లో 2008 నుంచి గతేడాది వరకు పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచే ల్యాప్‌టాప్‌లు ఇచ్చి, డిజిటల్‌ కంటెంట్‌ ద్వారా బోధించేవారు. అయితే గతేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి, ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను పరిచయం చేశారు. ఆగస్టు 4 నుంచి మిడ్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మీడియాపై ఆంక్షలు

ట్రిపుల్‌ఐటీలో నెలకొన్న లోపాలను, మెస్‌లలో నాసిరకం ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్న వైనాన్ని గత రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో ట్రిపుల్‌ఐటీ అధికారులు మంగళవారం మీడియాపై ఆంక్షలు విధించారు. లోపాలను సరిచేసుకోవాల్సిన ట్రిపుల్‌ఐటీ అధికారులు అవేమీ చేయకుండా లోపలికి రావాలంటే అనుమతి తీసుకోవాలని ప్రధాన గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఉత్తర్వులు పంపారు. వీసీని కలిసేందుకు మంగళవారం విలేకరులు లోపలికి వెళ్లేందుకు అనుమతి కోసం రెండుసార్లు సెక్యూరిటీ సిబ్బంది ఫోన్‌ చేయగా రెండుసార్లు కూడా బిజీగా ఉన్నారంటూ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ప్రభుత్వ సంస్థ అయిన విద్యాసంస్థలోకి వెళ్లడానికి అనుమతులు తీసుకోవాలనడంపై ట్రిపుల్‌ఐటీ సిబ్బందే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు మాత్రం ట్రిపుల్‌ఐటీలోకి ఇష్టారాజ్యంగా వెళ్తే వస్తూ ఉండటం గమనర్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement