ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దే వస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (తిరుపతి) (పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థ) మేనేజర్‌పై మహిళా కార్మికులు చేస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు పరుష పదజాలాన్ని వాడుతున్నాడని వారు అంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిని ఏదో ఒక వంకతో పనిలోంచి తీసేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా కార్మికులు ఆది వారం ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావుకు ఫిర్యాదు చేశారు. సదరు మేనేజర్‌పై ఈ ఆరోపణలు, ఫిర్యాదులు కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ 1న ఈ సంస్థ శ్రీవారి దేవస్థానంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పనులు చేపట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు మహి ళా కార్మికులతో అసభ్యకరంగా చేసిన వాట్సాప్ చా టింగ్‌లు, ఫోన్లలో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్‌లు గతంలోనే బయటపడ్డాయి. అయితే కాంట్రాక్టర్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో అధికారులు మేనేజర్‌పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని పలువురు అంటున్నారు. అలాగే నాసిరకం మెటీరియల్ వినియోగంపై నోరు విప్పితే.. టార్గెట్ చేసి, పనిలోంచి తీసేస్తున్నారని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్య పనులకు సంబంధించి మెషీనరీకి మాత్రమే దేవస్థానం నెలకు సుమారు రూ.3.50 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఇలా రెండేళ్లకు దాదాపు రూ.84 లక్షలు చెల్లించనుంది. అయితే ఇంత విలువైన మెషినరీ ఈ దేవస్థానానికి వచ్చిందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మొత్తంగా పారిశుద్ధ్య పనులకు నెలకు రూ.18.28 లక్షలు చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.54 లక్షల వరకు చెల్లిస్తోంది.
ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు
తాము పదేళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, ఇప్పటివరకు ఏ మేనేజర్ వల్ల ఇంత ఇ బ్బంది పడలేదని సూపరింటెండెంట్‌కు కార్మికులు తెలిపారు. దేవస్థానంపై ఆధారపడి బతుకుతున్న తమను అధికారులు ఆదుకోవాలని, అలాగే సదరు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇప్పటివరకూ జీతాల్లేవ్
పద్మావతి కాంట్రాక్ట్ సంస్థ కింద దేవస్థానంలో 180 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటి నుంచి కార్మికులకు జీతాలు ఆలస్యంగానే అందుతున్నాయి. ఈనెల 5లోపు అందాల్సిన జీతాలు, నెలలో సగం రోజులు గడిచినా.. ఇప్పటివరకు అందలేదు.
పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థపై కార్మికుల మండిపాటు
శానిటేషన్ మేనేజర్ ఆగడాలపై ఫిర్యాదు
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా కార్మికుల ఆరోపణలు
నెలలో సగం రోజులు గడిచినా అందని జీతాలు
కాంట్రాక్టర్ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో చర్యలు శూన్యం


