జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం, చెరువులు, కాలువ గట్లు కాదేదీ మట్టి దోపిడీకి అన్నట్టు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి రైతులు తమ పొలాలను ఎత్తు చేసుకునేందుకు చె రువులు, జలాశయాల నుంచి మట్టిని తవ్వుకోవ చ్చు. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు మట్టిని అక్రమంగా తవ్వుతూ ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు.
అధికారులపై దాడులకు తెగబడుతూ..
జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల్లో మట్టి దోపిడీ ఎక్కువగా ఉంది. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో చిన్న, పెద్ద చెరువు మట్టిని తరలిస్తుండగా ఇరిగేషన్ అధికారులు అడ్డుకోగా మట్టి మా ఫియా వారిపై దాడులకు పాల్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జేసీబీ, మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తవ్వేయ్.. దోచేయ్..
● వేగవరం, తాడువాయి గ్రామాల పరిధిలో ఎర్రకాలువ జలాశయంలో మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నారు.
● కొయ్యలగూడెం మండలంలో చెరువుల్లో మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో భారీ గోతులు పెట్టడంతో రైతులు, పశువుల కాపర్లు, పశువులు ప్రమాదాలకు గురవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా గ్రామాల పరిధిలో రోడ్లు పాడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇక్కడ పరిమిత క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేస్తున్నారు.
● టి.నరసాపురం మండలం కేతవరం రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ను తవ్వి తరలించేస్తున్నారు.
● బుట్టాయగూడెం, కొయ్యలగూడెం సరిహద్దులో ఉన్న చెరువులో మట్టిని తరలించేస్తున్నారు.
కొయ్యలగూడెం మండలంలో మట్టి తవ్వకాలు
కేతవరంలో మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్
ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో దందా


