పత్తాలేని సోపానం | - | Sakshi
Sakshi News home page

పత్తాలేని సోపానం

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

న్యూస్‌రీల్‌

కావాల్సిన వారితో జాబితాలు

‘పాలకొల్లుకు చెందిన ఒకరు కాపు కార్పొరేషన్‌ సబ్సిడీ రుణానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రుణ సాయానికి ఎంపికయ్యారని, త్వరలో రుణం మంజూరవుతుందని అధికారులు చెప్పారు. ఇది జరిగి ఏడాదైనా ఇంతవరకు అతనికి రుణం మంజూరుకాలేదు. అధికారులను అడిగితే సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదని, ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు’.

మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ‘స్వయం ఉపాధి సోపానం’ పేరిట దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక పేరిట అప్పట్లో రెండు నెలల పాటు పెద్ద తతంగమే నడిచింది. మండల, మున్సిపల్‌ స్థాయిలో బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు కలిసి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ప్రభుత్వం తర్వాత స్వయం ఉపాధిని అటకెక్కించింది.

ఏడాది దాటినా చర్యలు శూన్యం

ఎస్సీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ, బీసీ–ఇ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ తదితరులకు స్వయం ఉపాధి, జనరిక్‌ ఫార్మసీలు, ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు పేరిట సబ్సిడీ రుణాల మంజూరుకు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు దాదాపు రూ.260 కోట్ల విలువైన 10,554 యూనిట్లు కేటాయించింది. వీటిలో పశ్చిమకు రూ.122.5 కోట్ల విలువైన 3,728 యూనిట్లు, మిగిలినవి ఏలూరు జిల్లాకు కేటాయించారు. రూ.రెండు లక్షలు, రూ. 2 నుంచి రూ. 3 లక్షలు, అలాగే రూ. 3 నుంచి రూ. 5 లక్షల కేటగిరీలుగా విభజించారు. జనరిక్‌ మెడికల్‌ షాపుల యూనిట్‌ ధర రూ.8 లక్షలుగా ఉంది. యూనిట్‌ వ్యయం మొత్తంలో 40 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణంగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి యూనిట్లను గ్రౌండ్‌ చేయాలని భావించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో మే నెలాఖరు వరకు పొడిగించింది. ఎంపిక చేసిన వారికి మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్‌ మొదటి వారం మధ్యలో ఇంటర్వ్యూలు నిర్వహించి త్వరలోనే రుణాలు మంజూరవుతాయని అధికారులు చెప్పుకొచ్చారు.

త్వరలోనే కార్పొరేషన్‌ రుణాలు మంజూరవుతాయని కూటమి నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొద్ది నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కావాల్సిన వారికి సబ్సిడీ రుణాలు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్‌ రుణాల విషయమై బీసీ కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని అంటున్నారు.

పేరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి లబ్ధిదారుల ఎంపిక అంతా అధికార పక్షాల నేతల కనుసన్నల్లోనే జరిగింది. నియోజకవర్గాలకు కేటాయించిన యూనిట్లను కూటమి నాయకులు పంచుకుని కావాల్సిన వారిని ఎంపికలు చేసుకున్నారన్న విమర్శలున్నాయి. చాలాచోట్ల సింహభాగం టీడీపీనే తన్నుకు పోయిందన్న అసంతృప్తిలో జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఒక్కో గ్రామానికి మంజూరైన యూనిట్లు ఐదు నుంచి పదిలోపే ఉండగా దరఖాస్తులు మాత్రం పదుల సంఖ్యలో వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఒక్క యూనిట్‌ గ్రౌండ్‌ కాకపోవడం గమనార్హం. రుణాల మంజూరు కోసం గత వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేసినట్టు ప్రజాప్రతినిధులు ప్రకటించినప్పటికీ వాటిని దారి మళ్లించారన్న విమర్శలున్నాయి. సబ్సిడీ రుణాల పేరిట కొందరు నాయకులు చెక్కులు పంపిణీ చేసిన ఘటనలు ఉన్నాయి. కాగా రుణాలు రాని వారి అసంతృప్తి కూటమికి చేటు చేస్తుందన్న భావనలో సోపానంపై ప్రభుత్వం సైలెంటై పోయి ఉండవచ్చని, మరోపక్క సబ్సిడీ సొమ్ములు జమచేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కారణమన్న అనుమానాలు ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాలను ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచారు.

సబ్సిడీ రుణాల ఊసెత్తని సర్కారు

ఉమ్మడి జిల్లాకు రూ.260 కోట్ల విలువైన రూ.10,554 యూనిట్ల కేటాయింపు

దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల పేరిట హడావుడి

ఏడాదైనా కార్యరూపం దాల్చని వైనం

Advertisement
 
Advertisement
Advertisement