ఆక్వా విలవిల | - | Sakshi
Sakshi News home page

ఆక్వా విలవిల

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎండల దెబ్బకు చుట్టుముడుతున్న వ్యాధులు

కొల్లేరులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఉమ్మడి జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు

ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా అందకపోవడంతో ప్రస్తుతం నీటి స్థాయిలు తగ్గాయి. ఎండాకాలంలో వాతావరణ మార్పుల వల్ల చేపలు చనిపోతే సమ్మర్‌ కిల్‌ అంటారు. మరోపక్క చేపలు, రొయ్యల్లో వ్యాధులు పెరగుతోన్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

చేపలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య బాగా పెరుగుతాయి. కొద్ది రోజులుగా కొల్లేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరింది. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్‌ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు వేసవి కాలం చివరలో వచ్చే తొలి వర్షాల వల్ల ఆక్సిజన్‌ లేమి సమస్యతో రూ.కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు.

చుట్టుముడుతున్న వ్యాధులు : చేపల, రొయ్యల చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా లేకపోవడంతో నీటిలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చేపల్లో జిగురు, జలగ, శంఖుజలగ, సన్న జలగ, తాటాకు తెగుళు, పొట్టఉబ్బు వ్యాధి, ఎర్ర మచ్చల వ్యాధి, రొయ్యల సాగులో వైట్‌ స్పాట్‌, ఈహెచ్‌సీ, ఆర్‌ఎంఎస్‌ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవిలో సూర్యరశ్మి పెరగడం వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. ఇదే సమ్మర్‌ కిల్లింగ్‌కు దారితీస్తోంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆక్వా రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తల్ని మత్స్యశాఖ అధికారులు వివరిస్తున్నారు.

వేసవిలో ఆక్వా సాగు రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా సాగు ప్రాంతాల్లో వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ మత్స్య లేబోరేటరీలో నీటి, మట్టి పరీక్షలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.

–సీహెచ్‌ గణపతి,

మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరు

Advertisement
 
Advertisement
Advertisement