భీమవరం: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిగా బి.సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన కుమరేషన్ బదిలీపై అమలాపురం వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సుబ్బారావు కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు హాజరయ్యే అర్జీదారుల సౌకర్యార్థం, శ్రీ సుభాశిష్ చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినీ వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మినీ వ్యాన్ ప్రతి సోమవారం ఉదయం భీమవరం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమై, కొత్త బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రజా సేవకు ముందుకొచ్చిన శ్రీ సుభాశిష్ చక్రవర్తి ఫౌండేషన్ నిర్వాహకులు డీటీడీసీ బాబుకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
భీమవరం: దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిస్కార కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మూడోదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ పీఎస్.విజయ రామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం చెప్పారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ 25న జిల్లా నుంచి 1000 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేవీ.రామచంద్రరావు, కో–కన్వీనర్లు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ట్రెజరర్ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సంబంధిత పోలీస్‌స్టేషన్స్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని వారికి పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించి సమస్యలను పరిష్కరించాలన్నారు.
నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో నాలుగు, ఐదో తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఫరూఖ్ సోమవారం తెలిపారు. మిగిలిన సీట్లు ఎస్టీ కేటగిరి విద్యార్థులకు సంబంధించినవి కావడంతో ఆ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తులను కేంద్రీయ విద్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు.


