గంజాయి కలకలం.. వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

గంజాయి కలకలం.. వృద్ధురాలి మృతి

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

గంజాయి కలకలం.. వృద్ధురాలి మృతి

ద్వారకాతిరుమల: గంజాయి కేసులో ఇరుక్కున్న తన కుమారుడి భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న భయంతో తూర్ల లక్ష్మీపురానికి చెందిన వృద్ధురాలు సెనగన స్వరాజ్యం(76) గుండె పోటుతో సోమవారం మృతి చెందింది. దీనికి స్థానిక కూటమి నాయకుడు, రౌడీ షీటర్‌ సుంకర ఆంజనేయులే కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు వృద్ధురాలి మృతదేహాన్ని అతని ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్‌ సిబ్బందితో కలసి రంగప్రవేశం చేసి, ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సెనగన శ్రీనివాసరావు ఇంటి వద్ద గంజాయి ఉందని ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తి 112కు కాల్‌చేసి సమాచారం ఇచ్చాడు. దాంతో భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్‌ సిబ్బందితో కలసి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంటికి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ గోడ సందులో ఒక సంచిలో రూ.40 వేలు విలువైన గంజాయి ప్యాకెట్లు, రూ.6,501 విలువైన 5 మద్యం బాటిళ్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆ తరువాత శ్రీనివాసరావు వచ్చి తన తండ్రికి, సుంకర ఆంజనేయులకు మద్య గొడవలు ఉన్నాయని, అతనే వీటిని ఇక్కడ పెట్టించి ఉంటాడని పోలీసులకు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్‌ దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు వల్ల తన కుమారుడికి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో శ్రీనివాసరావు తల్లి స్వరాజ్యం గుండె పోటుతో మృతి చెందింది. తమపై ఆంజనేయులు కేసు బనాయించేందుకు ప్రయత్నించడం వల్లే స్వరాజ్యం మృతి చెందిందిని ఆరోపిస్తూ, అతని ఇంటి ముందు శవ పేటికతో బైఠాయించి, ధర్నా చేశారు. గంజాయి కలకలం రేగి మూడు రోజులైనా పోలీసులు ఆంజనేయులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ప్రశ్నించారు. పల్లెటూరిలోకి గంజాయి ఎలా వచ్చిందనే విషయాన్ని ఇప్పటికై నా పోలీసులు నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధీర్‌ ఆందోళనకారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.

రోడ్డుపై మృతదేహంతో ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement