భీమవరం: బాణసంచా తయారీలో అధిక విస్పోటన సామర్థ్యం గల రసాయనాల వినియోగం పెరగడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం భీమవరం విష్ణు కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణలో ఉత్తమ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్న సంస్థలకు అవార్డులందించారు. ఫ్యాక్టరీల విభాగంలో తణుకు ఆంధ్ర సుగర్స్, పాలకోడేరు ఆనంద ఎంటర్ ప్రైజెస్, ఏలూరుపాడు సుమిత్ నారాయణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలు ఎంపిక కాగా.. హాస్పిటల్స్ విభాగంలో భీమవరం హాస్పిటల్, తణుకు నిమ్మగడ్డ హాస్పిటల్, తాడేపల్లిగూడెం జీఆర్ రెడ్డి ఐ హాస్పిటల్‌కు అవార్డులు అందచేశారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


