బోదెల మరమ్మతులు చేసుకోవాలి
కై కలూరు: ఆక్వారంగం ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నప్పటికీ అంతే పర్యావరణ కాలుష్యానికీ కారణమవుతోంది. చేపల, రొయ్యల చెరువుల్లో నీటిని బయటకు పంపడానికి సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పంట కాల్వలోకి సైతం రసాయనాలు కలిసిన ఆక్వా చెరువుల నీరు చేరుతోంది. దీంతో ఎగువ గ్రామాల ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ప్రధానంగా చెరువుల సమీపంలో రహదారులు ఆక్వా రైతుల నిర్లక్ష్యానికి దెబ్బతింటున్నాయి. వరహాపట్నం గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
రొయ్యల చెరువు నీరు రోడ్లపైకి..
ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నం నుంచి రామవరం వెళ్లే రహదారిలో వరహాపట్నం పంచాయతీ పరిధిలో సుమారు 8 ఎకరాల రొయ్యల రైతు సాగు దెబ్బతినడంతో ఆదివారం రాత్రి నుంచి పైపుతో నీటిని రోడ్డుపై వదులుతున్నాడు. దీంతో సోమవారం ఉదయం రోడ్డు పెద్ద చెరువులాగా మారింది. నిండు వేసవిలో రహదారి మునగడంపై వాహనదారులు మండిపడ్డారు. రోడ్డుపై గుంతలు పడటంతో అనేక మంది అతికష్టం మీద భయంభయంగా ప్రయాణించారు. రైతు శ్రీనివాసరావును నీటిని వదలడంపై వివరణ కోరితే ముందు రైతులు డ్రెయిన్‌కు అడ్డుగా వేయడంతోనే నీరు నిలిచాయని చెప్పుకొచ్చాడు.
పాత సమస్య పునరావృతం
వరహాపట్నం పరిధిలో అన్నవా డ్రెయిన్ సమీపంలో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీటిని డ్రెయిన్ ద్వారా పంపించాలి. ఇందుకు అనేక మంది అవకాశం లేకపోవడంతో పంట కాల్వలోకి వదులుతున్నారు. ఇటీవల వరహాపట్నంలో చెరువుల రైతులు నీటిని రోడ్డుపైకి వదలడంతో అడుగు నీటిలో రోడ్డు ముంపుబారిన పడింది. దీంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా వెళ్లి రహదారిని పరిశీలించారు. ఆక్వా రైతులు పూడుకుపోయిన డ్రెయిన్లకు మరమ్మతులు చేసుకుని నీటిని వదలాలని హెచ్చరించారు. ఇది జరిగి 6 నెలలు దాటుతున్నా రోడ్డు వెంబడి డ్రెయిన్లకు ఆక్వా రైతులు మరమ్మతులు చేసుకోలేదు. ఈ రహదారిలో మరికొందరు రైతులు చెరువుల నీటిని వదిలితే వరహాపట్నం – రామవరం రహదారి పూర్తిగా మునిగి ప్రయాణాలు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వరహాపట్నంలో అన్నవా డ్రెయిన్ మరమ్మతులు చేయించాం. వరహాపట్నం – రామవరం రహదారిలో రోడ్డుకు ఇరువైపుల ఆక్వా రైతులు జేసీబీ యంత్రంతో బోదెలను మరమ్మతులు చేసుకోవాలి. సమస్యను ఎమ్మెల్యే కామినేని దృష్టికి తీసుకువెళతాం. రహదారుల సమీపంలో ఆక్వా రైతులు నీటిని రోడ్లపైకి విడిచిపెడితే చర్యలు తీసుకుంటాం.
–ఎం.రామకృష్ణ, డ్రెయినేజీశాఖ, డీఈఈ, కై కలూరు
రొయ్యల చెరువు నీరు రహదారిపైకి
ఎమ్మెల్యే కామినేని స్వగ్రామంలో వీడని సమస్య
వరహాపట్నం – రామవరం రహదారిలో ప్రజల అవస్థలు
పంట కాల్వలకు చేరుతున్న అక్వా చెరువుల కలుషిత నీరు


