భీమవరం (ప్రకాశం చౌక్) : రెడ్‌క్రాస్ గవర్నర్ అవార్డుకు పశ్చిమగోదావరి కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చేనెల 8న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తారన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా.ఎంఎస్‌వీఎస్ భద్రిరాజు, జిల్లా రెడ్ క్రాస్ కమిటీ వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు, ట్రెజరర్ కేబీ తిరుపతి రాజు, సభ్యులు జి.కృష్ణారావు, కేఆర్‌ఎస్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భీమవరం: నెట్‌సెంటర్, ఏటీఎం మెషీన్ ఏర్పాటు చేస్తామంటూ మాయమాటలు చెప్పి తన కుమారుడు గంధం రామకృష్ణ వద్ద రూ.13.50 లక్షలు కాజేశారంటూ భీమవరం పట్టణానికి చెందిన గంధం హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హరిప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన అనేక పర్యాయాలు పట్టణంలోని ఎడ్వర్డ్‌ట్యాంక్ ప్రాంతంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్న పెన్నాడ శ్రీసత్యకిరణ్ వద్దకు వెళ్లడంతో హరిప్రసాద్ కుమారుడు రామకృష్ణకు పరిచయమయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీసత్యకిరణ్ అతని భార్య హరిత, అశోక్‌సామ్రాట్ నెట్‌సెంటర్, ఏటీఎం మెషీన్ ఏర్పాటుచేస్తామని మాయమాటలు చెప్పి రామకృష్ణ నుంచి పలు దఫాలుగా రూ.13.50 లక్షలు కాజేశారు. అంతేగాకుండా పి రామరావు, గన్నాబత్తుల వెంకటేశ్వరరావు వద్ద కూడా సుమారు రూ.17 లక్షలు కాజేశారని హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ చెప్పారు.
ఏలూరు రూరల్: శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకూ విశాఖపట్టణంలో బాక్సింగ్, అనంతరపురంలో ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 9 గంటలకు చేపడతామన్నారు. బాక్సింగ్ విభాగంలో అండర్–15, 19 బాలబాలికలు, ఫుట్‌బాల్ విభాగంలో అండర్–15, అండర్–21 బాలబాలికల జట్లు ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కోచ్ ఖాసిం 94927 01324 నంబరలో సంప్రదించాలని సూచించారు.


