పెనుమంట్ర: నత్తరామేశ్వరం గ్రామంలో గోస్తనీ నదిలో కొలువైయున్న (సప్త కోటేశ్వర) శ్రీ రామలింగేశ్వర స్వామికి దాతలు రూ.36 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను సమర్పించారు. గ్రామానికి కర్రి అచ్చిరెడ్డి, లక్ష్మి తులసి దంపతులు 6 కిలోల వెండితో కవచం, కర్రి అప్పిరెడ్డి, లక్ష్మీ కాంతం దంపతులు 6 కిలోల వెండితో నాగాభరణాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం వాటిని స్వామికి అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ద్వారంపూడి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తమలపూడి నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.
తొలి సోమవార పూజలు
గోస్తని నదిలో వేంచేసి ఉన్న శ్రీ సప్త కోటేశ్వర లింగానికి వైశాఖమాస పర్వదినం పురస్కరించుకుని తొలి సోమవార పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి.
నరసాపురం రూరల్ : మొగల్తూరు మండల ముత్యాలపల్లి మోడి గ్రామంలోని వినాయకుని ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆలయ కమిటీ సభ్యులు గుడికి తాళాలు వేసి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో స్థానికుడైన మారెళ్ల ముత్యాలరావు ఆలయం వద్దకు రాగా, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి హుండీ చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీలో సుమారు రూ.పది వేల వరకు కానుకలు ఉంటాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుడు దాసరి వెంకట శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు టౌన్: ఏలూరు శివారు క్రాంతి కళ్యాణమండపం సమీపంలో ఖాళీ స్థలంలో కుళ్లిన మహిళ మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


