భీమవరం: జిల్లాలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఏపీఆర్‌ఎస్ క్యాట్, ఏపీఆర్జేసీ, డీసీసెట్, పాలిసెట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్ష 24న ఉదయం 10 గంటలకు భీమవరం భాష్యం హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. అలాగే ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భీమవరంలోని భాష్యం హైస్కూల్, పీఎస్‌ఎం గరల్స్‌స్ హైస్కూల్, ఎస్సీహెచ్ బీఆర్‌ఎం హైస్కూళ్లలో ఏర్పాటుచేసిన సెంటర్లలో పరీక్షలు జరగుతాయన్నారు. 25న పాలిసెట్ పరీక్ష నిర్వహణకు తాడేపల్లిగూడెంలో 4, తణుకులో 10, భీమవరంలో 8, నర్సాపురంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యామ్ సుందర్, పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి: క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. అత్తిలి గ్రామంలో ఎంఎంస్కూల్ రోడ్డులో తోట వెంకట సత్యనారాయణ అలియాస్ సతీష్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసి తోట వెంకట సత్యనారాయణ, దిరిశాల సురేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, లాప్‌టాప్, 4 సెల్‌ఫోన్‌లు స్వాధీన పర్చుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై విశ్వనాఽథ్ చెప్పారు.
అంతా గోప్యం
క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనెల 19వ తేదీన అత్తిలి పోలీసులు దాడి చేసి బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నప్పటికీ కేసులో వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్తిలికి చెందిన అధికారపార్టీ కీలకనాయకులు ఈ బెట్టింగ్ వ్యవహారంలో పట్టుబడ్డారని సమాచారం.
కొయ్యలగూడెం: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. దిప్పకాయలపాడు దళితవాడకు చెందిన కూనపాము లాజరు (62) కౌలుకి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద బట్టల తీగ నుంచి టవల్ తీసుకుంటుండగా సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. బంధువులు కొయ్యలగూడెం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే లాజర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


