● ఈనెల 26న ప్రారంభం కానున్న ఉత్సవాలు
● 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, మే 1న రథోత్సవం
ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 30న రాత్రి స్వామివారి కల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ఐరన్ పందిరిని నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడ కర్రల పందిరి ఉండేది. అయితే భక్తుల రక్షణలో భాగంగా దీన్ని ఐరన్‌తో నిర్మిస్తున్నారు. పందిరి నిర్మాణ పనులు పూర్తయిన తరువాత దానిపై తాటాకులు వేయనున్నారు. ఇదిలా ఉంటే గోపురాలపై మొలిచిన రావి, మర్రి మొక్కలను పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. సోమవారం ఈ పనులు శరవేగంగా జరిగాయి.


