ఉరి వేసుకుని వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని వివాహిత మృతి

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

తణుకు అర్బన్‌ : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పైడిపర్రులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పైడిపర్రుకు చెందిన లక్ష్మీనారాయణకు, పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనుమోలు దేవిలకు 11 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు ఆడపిలల్లలు సంతానం ఉన్నారు. లక్ష్మీనారాయణ హైదరాబాదులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండగా దేవి స్థానికంగా మోటారు సైకిళ్ల షోరూంలో పని చేస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన లక్ష్మీనారాయణ కొద్దిరోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన దేవి భర్త ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసికెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ దేవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి రూరల్‌ ఎస్‌సై జానా సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement