రూ.3 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరులో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఇరిగేషన్ స్థలాలు, చెరువులు, పోరంబోకు స్థలాలను టార్గెట్‌గా చేసి మరీ వాటి సమీపంలో కొద్దిభూమి కొనుగోలు చేయడం అది కూడా బెదిరింపులతో అడ్డగోలు వ్యవహారాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూములను కలుపుకుని దర్జాగా వెంచర్లు వేసి మధ్యతరగతి ప్రజలకు అంటకట్టి కోట్లు గడిస్తున్నారు. స్థలం కొనుగోలు చేసి చివరికీ బ్యాంకు లోన్‌కు వెళ్లి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే రెడ్‌మార్క్‌లో ఉందని, లోన్ రాదు.. అనుమతి ఉండదని అసలు సంగతి తెలుసుకుని షాక్ అవుతున్న పరిస్థితి. ఇదే కోవాలో ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సమీపంలోని వివాదాస్పద భూమిని దౌర్జన్యంగా దురాక్రమించి ప్లాట్లు వేసి మరీ సొమ్ములు చేసుకున్నారు.
అడ్డగోలుగా.. అనుమతులు లేకుండా..
ఏలూరు నగర శివారులో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పొలిటికల్ వెంచర్లు కొలువు తీరుతున్నాయి. డీటీసీపీ అనుమతులుగాని, నగరపాలక సంస్థలో ప్లాన్ అప్రూవల్‌గాని, ఇడాలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా పొలిటికల్ అండదండలతో కొందరు అధికార పార్టీ నాయకులు ప్రత్యక్ష భాగస్వాములుగా మారి రియల్ దందాకు తెరదీశారు. ప్రతి వెంచర్‌లోనూ ఇరిగేషన్ కాల్వ, ప్రభుత్వ పోరంబోకు, సర్కారు బాటలను కలుపుకుని వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో ఇదే తరహా వెంచర్ దందా కొనసాగింది. సుంకరవారితోట వంతెన సమీపంలో మూడు కుటుంబాలు ప్రైవేట్ శ్మశానవాటికగా వినియోగించుకోవడానికి వీలుగా 2.05 ఎకరాల భూమిని సర్వే నంబర్ 872లో కేటాయించుకుని వందేళ్ల నుంచి వినియోగించుకున్నారు. దాని సమీపంలోని 874 సర్వే నంబర్‌లో 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. అయితే కాలక్రమేణా ప్రాంతం పెరగడం, నగరపాలక సంస్థ పరిధిలోకి రావడం చుట్టుపక్కల నివాసాలు ఏర్పడటంతో సుమారు 40 ఏళ్ల నుంచి శ్మశాన వాటికగా వినియోగించుకోవడాన్ని నిలిపివేసి భూమిని ఆధీనంలో తీసుకున్నారు. అయితే వారసత్వపు భూమి కావడంతో అడంగల్ రికార్డులో నమోదైంది. అలాగే ఏళ్ల తరబడి సదరు కుటుంబాల ఆధీనంలోనే 2.05 ఎకరాల సెంట్ల భూమి ఉంది. సదరు కుటుంబాల ఆధీనంలోని భూమిపై పొలిటికల్ కన్ను పడి ముక్కలుగా విడిదీసి హద్దులు మార్చి ఏలూరులో కాకుండా ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రిజిస్ట్రేషన్‌తో మొదలుపెట్టి అన్నిచోట్ల భారీ వ్యవహారాలతో చక్కపెట్టి వెంచర్‌ను సిద్ధం చేసేశారు.
వెంచర్‌లో భవన నిర్మాణం
వెంచర్‌లో రహదారి
ఈ వెంచర్ దందాలో ప్రైవేటు భూమి యజమానులుగా ఉన్నవారిని అధికారం అడ్డం పెట్టుకుని బెదిరించి దందాలో కారుచౌకగా తీసుకోవడం, దీంతో పాటు మరో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. 15 సెంట్ల ఇరిగేషన్ కాలువను కలిపేసుకుని దానిని రోడ్డుగా మార్చి కాలువను మూసేశారు. గతేడాది సెప్టెంబర్ 12న పంట కాలువ అకస్మాతుగా పొంగడంతో రోడ్లన్నీ జలమయంగా మారి ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోవడంతో భూదందా వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా పరిశీలించి వచ్చారు తప్ప పట్టించుకోకపోవడం గమనార్హం.
పొలిటికల్ వెంచర్
కాలువ, పోరంబోకు కలుపుకుని వెంచర్
డీటీసీపీ, ఇడా అనుమతులు లేకుండా స్థలాల విక్రయాలు
సర్వే నంబర్లు మార్చి మరీ రిజిస్ట్రేషన్లు
అధికార పార్టీ నేతల అండతో అడ్డగోలు తంతు
రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
ఏలూరు శివారు వెంకటాపురంలో ఆక్రమణలు
కాలువ పొంగితే చెరువుగా స్థలాలు


