పోలీసు అధికారులు కావలెను! | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులు కావలెను!

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

స్టేషన్లలో ఇన్‌చార్జిలే దిక్కు

కేసుల్లో పురోగతి కరువు

స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు

అర్ధంతర బదిలీలు, ఆరోపణలతో వీఆర్‌కు అధికారులు

జిల్లాలోని పలు స్టేషన్లలో ఇదే పరిస్థితి

తణుకు అర్బన్‌: పోలీస్‌స్టేషన్లలో అధికారులు లేక బాధితులకు అందాల్సిన సేవలు కునారిల్లుతున్నాయి. జిల్లాలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో బాస్‌లుగా ఇన్‌చార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులతోపాటు సిబ్బంది కొరతతోపాటు వివిధ బందోబస్తులకు వేరే ప్రాంతాలకు వెళ్తుండడంతో ప్రజానీకం తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు పడిగాపులు పడాల్సి వస్తుంది. క్రైమ్‌ రేటు అధికంగా ఉండే తణుకు రూరల్‌, పట్టణ స్టేషన్లలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌ అందుబాటులో లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ఖాళీలు ఇలా..

జిల్లాలో తణుకు పట్టణ, ఆకివీడు స్టేషన్లలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా పోయింది. తణుకు రూరల్‌, తణుకు పట్టణ స్టేషన్లలో ఇద్దరు ఎస్సైల స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ కారణంగా సీఐలు చేయాల్సిన బాధ్యతలు ఎస్సైలు చేస్తుండటం, ఎస్సైల బాధ్యతలు కిందిస్థాయి సిబ్బంది నిర్వహించాల్సి వస్తుందంటూ సిబ్బంది సైతం గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు నిర్వర్తించాల్సిన పనులు కింది స్థాయి సిబ్బంది చేయాల్సి రావడంతో కొన్ని కేసుల్లో పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదనేది ఫిర్యాదుల వాదన. జిల్లావ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో దీర్ఘకాలంగా తిష్ట వేసిన కొందరు సిబ్బంది సైతం అధికారుల విధులను తామే చేస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

వివాదాస్పదంగా తణుకు స్టేషన్లు

తణుకు పట్టణ స్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేకెత్తించింది. అప్పటివరకు అవినీతి కంపు కొట్టిన స్టేషన్‌లో రైటర్‌ సుబ్బారావు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు దొరికిపోగా, మరి కొందరు బతికి బయటపడ్డారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసు శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో మరి కొందరిపై వచ్చిన ఆరోపణల మేరకు అప్పటి సీఐతోపాటు ఎస్సైను రేంజ్‌ వీఆర్‌కు పంపించారు. కొందరు కిందిస్థాయి అధికారులను సైతం బదిలీపై పంపించారు. ఆ ఘటన తరువాత సీఐ, ఎస్సై పోస్టులు భర్తీ కాకుండా పోయాయి. ప్రస్తుతం ఒక్క ఎస్సైతోనే స్టేషన్‌ను నెట్టుకురావాల్సి వస్తోంది. తణుకు రూరల్‌ సర్కిల్‌ అధికారుల వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. సర్కిల్‌లో ఫ్లెక్సీల వివాదాలు, ఇతర వ్యవహారాలతోపాటు కొన్ని కారణాలతో సీఐతోపాటు తణుకు రూరల్‌ ఎస్సై, అత్తిలి ఎస్సైలు రెండు రోజుల వ్యవధిలో మెడికల్‌ లీవుల్లోకి వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. జనవరి నెల 25న రూరల్‌ సీఐ బి.కృష్ణకుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌లు సెలవులోకి వెళ్లగా అదేనెల 27న అత్తిలి ఎస్సై ప్రేమ్‌రాజ్‌ సైతం మెడికల్‌ లీవులోకి వెళ్లారు. దీంతో సర్కిల్‌ సగానికిపైగా ఖాళీ అయ్యింది. ఇటీవల అత్తిలి స్టేషన్‌ ఎస్సై పోస్టు భర్తీ అయ్యింది. తణుకు రూరల్‌ సీఐగా దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఫిబ్రవరి 7న బాధ్యతలు స్వీకరించారు. పట్టణ ఇన్‌చార్జ్‌ సీఐగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకివీడులో సైతం ఈ ఏడాది కొన్ని కారణాలతో సీఐని బదిలీ చేయడంతో అప్ప టి నుంచి ఇన్‌చార్జ్‌ పాలన సాగుతోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన తణుకు పట్టణ, రూరల్‌ స్టేషన్‌లలో విధి నిర్వహణకు అధికారులు వచ్చేందుకు కూడా వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని పోలీసు వర్గాలే చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement