పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని ముంపు గ్రామాలైన సింగన్నపల్లి, కొత్తూరు పరిసర ప్రాంతాల్లోని గోదావరి నదీ తీరంలో కూడా పులి సంచరించినట్లు అడుగు జాడలను బట్టి అటవీ శాఖాధికారులు గుర్తించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. చీఫ్ కన్జర్వేటర్ నీలకాంతనాథరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డిలు ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలన చేశారు. పులి దూడపై దాడి చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. రిజర్వు ఫారెస్ట్‌లో తాగునీటి వసతితో పాటు చల్లని దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతంలోనే కదలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. పులి జనావాస ప్రాంతాల్లోకి సంచరించడం లేదని తెలిపారు. పులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీకెన్సీ ద్వారా నిరంతరం అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. పులి అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందని పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. సబ్ డీఎఫ్‌ఓ వెంకట సుబ్బయ్య, రేంజర్ ఎస్‌కే వలీ, సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పులి అడుగు జాడలను కదలికలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. పులిని పట్టుకోవడం కోసం శ్రీశైలం అటవీ శాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని ట్రాక్వలైజర్ గన్స్ వలలు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులో ఉంచామన్నారు.


