భీమవరం అర్బన్ : మండలంలోని గొల్లవానితిప్ప గ్రామంలో వాడుక చెరువులో కర్రనాచు, తూడు పేరుకుపోవడంతో జలాలు కలుషితమయ్యాయని ఈనెల 17న ‘సాక్షి’లో ‘తూడుతో నిండి.. అధ్వానంగా ఉండి’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ అధికారులు, పెద్దలు కలిసి చెరువులో కర్రనాచు, తూడు, సిల్టు తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. చెరువులో స్వచ్ఛమైన నీటిని నింపి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పంచాయతీ సిబ్బంది తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రంలో జనాభా గణన–2027 మొదటి దశలో స్వీయగణన, ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యకలాపాల ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం మే 30 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవాలని, ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. మే 1 నుంచి ఎన్యుమరేటర్లు ఇళ్లకు వచ్చి వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చినఅమిరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని సీఐ కాళీచరణ్ తెలిపారు. ఆదివారం రాత్రి నిర్వహించిన దాడుల్లో రెండు సెల్‌ఫోన్లు, రూ.29,160 నగ దు స్వాధీనం చేసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.


