విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

విద్యుదాఘాతంతో యువకుడి మృతి గుర్తు తెలియని వృద్ధుడి మృతి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య గుర్తు తెలియని మృతదేహం లభ్యం పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య అనుదీప్‌ మృతిపై దర్యాప్తు చేయాలి

యలమంచిలి: గోదావరి మధ్యలంకలో ఉన్న ఆక్వా చెరువుల వద్ద పని చేస్తున్న యువకుడు ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పూర్మాజిత్‌ బైబ్యా (27) కొంతకాలంగా ఆక్వా చెరువుల మీద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ వైర్లు కాలికి తగలడంతో పడిపోయాడు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఏలూరు టౌన్‌: జాతీయ రహదారి గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వృద్ధుడు మృతిచెందాడు. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై వాహనం ఢీకొనడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు క్షతగాత్రుడిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. గుర్తు తెలియని వృద్ధుడికి ఏలూరు జీజీహెచ్‌ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మెడికో లీగల్‌ కేసుగా నమోదు చేసి హాస్పిటల్‌ ఔట్‌పోస్ట్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు అమీనాపేటకు చెందిన కారు డ్రైవర్‌ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమీనాపేటకు చెందిన మూల్పూరి చైతన్య ఏలూరులోని బిషప్‌ హౌస్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చైతన్య భార్య పదేళ్ళుగా సౌదీ అరేబియాలో ఉంటుంది. చైతన్యకు ఇద్దరు పిల్లలు ఉండగా బంధువుల వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్న చైతన్య మద్యానికి బానిసగా మారాడు. ఈ నేపధ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 18న అర్థరాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. తెల్లవారిన అనంతరం తలుపులు తీయకపోవటంతో పక్కన వారు గమనించి బంధువులకు సమాచారం అందించారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉండి: ఉండి పంట కాలువలో ఎన్నార్పీ అగ్రహారం శివారు చెరువుగట్టుపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం పోలీసులకు ఆదివారం లభ్యమైంది. పోలీసులకు అందిన సమాచారం మేరకు శనివారం ఉండి పంటకాలువలో మృతదేహం కొట్టుకువస్తుందని తెలియగానే పోలీసులు చెరువుగట్టుపాలెవం పరిధిలోని కాలువ పొడవునా వెదికారు. కాలువలో చెత్తా చెదారంతో పాటు గుర్రపుడెక్క పెద్ద ఎత్తున మేటలు వేయడంతో మృతదేహం లభ్యం కాలేదు. దీంతో ఆదివారం పోలీసులు ఎస్సై ఎండీ ససీరుల్లా ఆధ్వర్యంలో మరోసారి ఉండి కాలువను జల్లెడపట్టారు. చెరువుగట్టుపాలెం వంతెన వద్ద మేటలు వేసిన గుర్రపుడెక్కలో పురుషుడి మృతదేహం లభ్యమైంది. వయసు సుమారు 35 నుండి 40 ఏళ్ళ మధ్యలో ఉంటుందని తెలిపారు.

ఏలూరు టౌన్‌: ప్రేమ పెళ్ళికి యువతి తల్లితండ్రులు నిరాకరించటంతో యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జంగారెడ్డిగూడెం ఆర్‌టీసీ బస్టాండ్‌ సమీప ప్రాంతానికి చెందిన నంబూరి వేణు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బెంగుళూరులోనే బాపట్ల పట్టణానికి చెందిన యువతిని ప్రేమించాడు. యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. తీవ్ర మనస్థాపానికి గురైన వేణు రెండు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలోని ఇంటికి వచ్చాడు. ఈనెల 18న పురుగుమందు తాగటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా... వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వేణు ఆదివారం ఉదయం మృతిచెందాడు.

చాట్రాయి: మండలంలోని చాట్రాయికి చెందిన అంబటి అనుదీప్‌ మృతిపై పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందూ జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా అనుదీప్‌ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని జనార్దన్‌ ముందు తల్లిదండ్రులు వాపోయారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేసేలా లేరని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సక్రమంగా దర్యాప్తు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని త్వరలోనే ఏలూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద రాష్ట కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని జనార్దన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement