దెందులూరు: పెదవేగి శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో విశిష్ట అలంకరణ చేశారు. వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ మాట్లాడుతూ.. పూజ టికెట్లపై రూ. 61,790, విరాళాల ద్వారా రూ.8,763, లడ్డు ప్రసాదాలకు రూ.21,750, ఫొటోలకు రూ.2,120 లు కలిపి మొత్తం రూ. 94,423 వచ్చాయని వివరించారు.
ముసునూరు: విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధం కాగా, మూడు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడిన సంఘటన మండలంలో జరిగింది. ఆదివారం సాయంత్రం మండల కేంద్రం ముసునూరు ఎస్సీ ఏరియాలో తాడి రాజు, తన కుమార్తెల కుటుంబాలకు చెందిన పూరిళ్లు విద్యుదాఘాతంతో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. మంటలు అధికంగా ఎగసిపడి వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నూజివీడు నుంచి అగ్నిమాపక శకటం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని వడ్లమానులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి మృతి చెందింది. గ్రామానికి చెందిన సులేమాన్ రాజు (40) శనివారం కృష్ణా జిల్లా ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన కొద్దిసేపటికి, కొడుకు మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన తల్లి రెడ్డి లక్ష్మీ నరసమ్మ (65) గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన మద్దాల వెంకటేశ్వర్లు పేరంపేటలో సెక్యురిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పేరంపేట వెళ్తుండగా.. వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులతో మాట్లాడి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.


