జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను చేధించారు. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం ఎస్సైకు ఈ నెల 17న రాత్రి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. దాడుల్లో పుల్లూరి నాగ వెంకటనరసింహాచార్యులను అరెస్టు చేసి అతని నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన అతనిని విచారించగా, పల్నాడు జిల్లా మొకలనూరుకు చెందిన మల్లెల వీరాజంనేయులు, ఎడ్లపాడుకు చెందిన తులబంతుల తాండవ కృష్ణ, ప్రకాశం జిల్లా ఉలగల్లుకు చెందిన పర్వతనేని వేణుబాబు అలియాస్ వేణు, కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన గజ్జల రవీంద్రరెడ్డి, అన్నమయ్య జిల్లా నిమ్మపల్లికి చెందిన పల్లెపాగ రవి కలిసి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్‌వీ ప్రసాద్, ఎస్‌కే జబీర్, ఏఎస్సై సంపత్‌కుమార్, పీసీలు షాన్‌బాబు, రమేష్, రామాంజనేయులు, హెచ్‌జీ సతీష్‌తో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో వీరిని అరెస్టు చేశారన్నారు. నిందితులు పెద్ద స్థాయిలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ టీవీ ప్రసారానికి ముందుగానే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యక్ష మ్యాచ్ ఫీడ్‌ను వీక్షించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, అన్ని లావాదేవీలు డిజిటల్ లెడ్జర్ సాప్ట్‌వేర్ ద్వారా నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, ఐప్యాడ్, కమ్యూనికేటర్ బాక్స్, వైఫై పరికరం, రెండు టీవీలు, 13 మొబైల్ ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, రూ.2,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలు నిర్వహించే అకౌంట్‌లో ఉన్న రూ.4 లక్షలు ీసీజ్ చేశారు.


