అధ్వానంగా డ్రెయిన్లు
కాలువల మరమ్మతులపై
● శిథిలావస్థలో లాకులు, అధ్వానంగా కాలువలు
● రూ.30 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
● కాలువలు మూసే సమయం దగ్గరపడినా ఇంకా రాని మంజూరు
● గత ఏడాది నాసిరకం పనులతో ముంపు సమస్య
గోస్తనీ పంట కాలువపై నిర్మించిన లాకులు 20 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్నాయి. ఇరగవరం, పెనుమంట్ర మండలానికి చెందిన సుమారు 10 గ్రామాలకు చెందిన 3,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పదేళ్లుగా ఈ ప్రాంతాల రైతులు సాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది పడుతున్నారు. పాత లాకుల రహదారి కూడా పూర్తిగా మూసివేయడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతున్నారు.
– మారిశెట్టి శ్రీనివాస్, రైతు, ఎస్.ఇల్లిందలపర్రు
కాలువలు, డ్రెయిన్లు గుర్రపు డెక్క, చెత్తా చెదారంతో పూడుకుపోయాయి. సాగునీరు అందక నానా కష్టాలు పడుతున్నాం. పూడికతీత చర్యలు చేపట్టి సాగునీరు అందించాలి. మురుగు బోదెలు ప్రక్షాళన చేసి రానున్న సార్వా సాగులో చేలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి.
– ఎం జగన్మోహనరావు, రైతు, మోగల్లు
సాక్షి, భీమవరం: ‘వెంకయ్య వయ్యేరు పంట కాలువ శివారు ఏలూరుపాడు లాకుల షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. తలుపుల కింది భాగం పూర్తిగా దెబ్బతినడంతో సాగునీరు వృథాగా ఉప్పుటేరులోకి వెళ్లిపోతుంది. లాకుల పరిధిలోని ఏలూరుపాడు, జువ్వలపాలెం, కలవపూడి, మోడీ, ఎస్సీ బోస్ కాలనీ తదితర గ్రామాలకు ఏటా సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలోని మిగిలిన చోట్ల దాదాపు ఇదే పరిస్థితి.’
జిల్లాలో 357 కి.మీ పొడవునా 11 మేజర్ కెనాల్స్, 1776 బ్రాంచ్ కెనాల్స్ ద్వారా 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, చెరువులకు తాగునీరు సరఫరా అవుతోంది. కాలువలు పూడికతో నిండిపోయాయి. వాటర్ లెవల్స్ నిర్వహణలో కీలకమైన లాకులు శిథిలస్థితికి చేరుకుంటున్నాయి. నరసాపురం, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లలోని 20 లాకులకు చినకాపవరం, ఏలూరుపాడు, ఎస్.ఇల్లింద్రపర్రు, పరిమెళ్ల, చిలకంపాడు తదితర లాకుల షట్టర్లు, చాంబర్ గేట్లు బాగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. లీకేజీలతో సాగునీరు వృథాగా పోతుండటం, పంటకాలువల పూడికతో శివారు ప్రాంతాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఎదురవుతోంది. గత సీజన్‌లో కాలువలకు నీరు విడుదల చేసిన నెల రోజుల తర్వాత కూడా శివారు భూములకు నీరందక పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో నారుమడులు ఎండిపోయి పొలాలు బీటలు తీశాయి. నీటి ఎద్దడిపై పలుచోట్ల రైతులు నిరసన వ్యక్తంచేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకొల్లులో సైతం అప్పట్లో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బంది పడ్డారు. గత సీజన్‌లో కాలువల నిర్వహణకు రూ.12.73 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత సీజన్‌కు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం)తో పాటు లాకుల మరమ్మతులు, పూడికతీత తదితర పనులు చేపట్టేందుకు దాదాపు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి మంజూరు రాకపోవడం గమనార్హం.
పనులు క్లోజ్ ?
ఏటా ఏప్రిల్ రెండో వారం తర్వాత కాలువలు మూసివేసి జూన్ 1న తెరుస్తుంటారు. ఈనెల 20 నాటికి కాలువలు మూసివేయనున్నట్టు మొదట్లో అధికారులు ప్రకటించినా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో ఖరీఫ్ ఆలస్యం కావడంతో సాగు అవసరాల నిమిత్తం మరికొద్ది రోజులు పొడిగించే వీలుంది. ముందస్తు సాగులో భాగంగా ఈ ఏడాది మే రెండో వారం తర్వాత నీటిని విడుదల చేస్తారన్న ప్రచారం ఉంది. పంట కాలువల్లో నీరు అడుగంటి పనులు మొదలు పెట్టేందుకు కనీసం పది రోజులు సమయం పడుతుంది. ఈ వ్యవధిలో తూడు తొలగింపు, కల్వర్టులకు రివిట్‌మెంట్లు నిర్మాణం, లాకులకు చిన్నపాటి మరమ్మతులకు మాత్రమే ఈ సమయం సరిపోతుంది. పూర్తిస్థాయిలో కాలువలు, లాకుల అభివృద్ధికి వీలుకాదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గత రెండేళ్ల మాదిరి ఈ ఏడాది కూడా క్లోజర్ పనులకు ఎగనామం పెట్టినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 294 కిలోమీటర్లు పొడవునా 13 మేజర్, 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. 2025–26లో వీటి నిర్వహణకు నిమిత్తం రూ.11.28 కోట్లు విలువైన 265 పనులు మంజూరయ్యాయి. 61 పనులు పూడికతీత, షట్టర్స్ మరమ్మతులకు కాగా, మిగిలినవి గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు. ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. నీటిసంఘాల మాటున నామినేషనన్ పద్దతిపై కూటమికి చెందిన వారు పనులు దక్కించుకున్నారు. తొలకరికి ముందే పనులు చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారు. తూతూమంత్రంగా తూడు తొలగించి తంతు నడిపించారు. ఖరీఫ్ చివరిలో వచ్చిన మోంథా తుఫాను పెద్దగా ప్రభావం చూపకపోయినా డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ముంపు సమస్యతో జిల్లాలోని 20,174 మంది రైతులు 22 వేల ఎకరాల్లోని పంట నష్టపోయారు. రబీ కోతలు మొదలైనా రైతులకు ఇంకా తొలకరి పంట నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది కేవలం పూడికతీత, తూడు తొలగింపునకు రూ.13 కోట్లు విలువైన 244 పనులకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు మంజూరు రాలేదని అధికారులు అంటున్నారు.


