మెరుగైన సేవలందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు

ద్వారకాతిరుమల: భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం నూతన ఈఓ వేండ్ర త్రినాథరావు అన్నారు. అన్నవరం దేవస్థానం నుంచి బదిలీపై వచ్చిన ఆయన శనివారం చినవెంకన్న దేవస్థానంలో ఈఓగా బాధ్యతలు చేపట్టారు. తొలుత త్రినాధరావు దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ కార్యాలయంలో డీఈఓ వై.భద్రాజీ నుంచి ఆయన చార్జ్‌ స్వీకరించారు. ఈ సందర్బంగా సాక్షితో మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుబంధం ఉందని గుర్తి చేసుకున్నారు. మరోసారి ఈ ఆలయానికి ఈఓగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. ఇన్ని సార్లు ఈఓగా రావడానికి శ్రీవారి కృపా, కటాక్షాలే కారణమని నమ్ముతున్నానని చెప్పారు. 2017–2018 మధ్య సుమారు రూ.70 కోట్లతో వకుళమాత నిత్యాన్నదాన భవనం, పవర్‌ హౌస్‌, బుకింగ్‌ కౌంటర్లు, కల్యాణకట్ట, ఘాట్‌ రోడ్లు, ధర్మఅప్పారాయ నిలయం, శ్రీవారి నిత్య కల్యాణ మండపం, క్యాంటీన్‌, సెంట్రల్‌ స్టోర్స్‌ వంటి భవనాలను ఈఈ డీవీ భాస్కర్‌ సహాయంతో నిర్మించామని ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అనివేటి మండప విస్తరణ, క్యూ కాంప్లెక్స్‌ భవనం, ధర్మ అప్పారాయ నిలయం భవనంపైన మరో అంతస్తు నిర్మాణాలకు తన హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆలయ పరువు, ప్రతిష్ఠలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపైనే ఉందని, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement