భీమవరం: సంస్థల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా కచ్చితమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భీమవరం పరిధిలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా గ్యాస్ లీకేజీ వల్ల ఏర్పడిన మంటలను నియంత్రించి చైతన్యం కల్పించారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాసరావు, సహాయ అగ్నిమాపక అధికారి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


