తాడేపల్లిగూడెం: దేశంలో మామిడి సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల పరిధిలో 23 కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు మామిడి పంట, సమీకృత యాజమాన్య ఆధునిక పద్ధతులపై శనివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజల్వనతో శిక్షణను ప్రారంభించారు. ఉపకులపతి ధనుంజయరావు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు కొన్ని రకాల చీడపీడలకు కారణం అవుతున్నాయని, ముఖ్యంగా నల్ల తామర, పండు ఈగ వంటి సమస్యలు వల్ల మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. తెగుళ్ల నివారణ, నాణ్యమైన దిగుబడి, సాగు ఖర్చు నియంత్రణలకు నూతన సాంకేతిక విధానాలను నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిందని, వీటిని మామిడి రైతులకు అందించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. అనంతరం మామిడి తోట యాజమాన్యానికి అవసరమైన పంట క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 23 కేవీకేల నుంచి శాస్త్రవేత్తలు హాజరై వారి జిల్లాల్లోని మామిడి పంట పరిస్థితులను వెల్లడించారు. సందేహాలకు సీనియర్ శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకున్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ సీహెచ్ రూత్, జి.రామానందం, బీకేఎం లక్ష్మి, కె.రాధారాణి, ఈ.కరుణ శ్రీ పాల్గొన్నారు.


