నిబంధనలకు నీళ్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

న్యూస్‌రీల్‌

రోజుకు రూ. కోటిపైనే వ్యాపారం

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: ఎండలు ముదురుతున్నాయి. ఒక పక్క గొంతెండుతుంటే ఉన్న నీరు ఎంత వరకు సురక్షితమనే సందేహం కలుగుతోంది. అడపాదడపా క్లోరినేషన్‌ మినహా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల ట్యాంకులు సరిగా క్లీనింగ్‌కు నోచుకోని పరిస్థితి. వీటికి తోడు పైప్‌లైన్‌ లీకేజీలు రక్షిత నీటిని కలుషితం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు గ్రామాల్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, తాగునీటి చేతిపంపులు, తాగునీటి బావుల్లో నీటిని పరీక్షించి లోపాలు ఉంటే అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరాన్ని బట్టి 15 రోజులకు, నెలరోజులకోసారి పరీక్షలు చేయాలి. ఈ రక్షిత నీటి పరీక్షలు ఏ మేరకు జరుగుతున్నాయనేది ప్రశ్నార్ధకమే. జిల్లాలోని 16 మండలాలు పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్లతో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ ఫేజ్‌–1 పనులు నత్తనడకన సాగుతున్నాయి. 55 క్లియర్‌ వాటర్‌ సంపులు, 40 ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, 69 ఓహెచ్‌ఆర్‌ఎస్‌లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 17 ఓహెచ్‌ఆర్‌ఎస్‌ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.

పుట్టగొడుగుల్లా ప్లాంట్లు

పంచాయతీలు, మున్సిపాల్టీలు సరఫరా చేస్తున్న రక్షిత నీరు కలుషితమవుతుండటం, శివారు ప్రాంతాలకు తాగునీటి ఎద్దడితో మినరల్‌ వాటర్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా రివర్స్‌ అస్మోసిస్‌ (ఆర్‌ఓ) ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐఎస్‌ఐ సర్టిఫికెట్‌ ప్లాంటు పెట్టాలంటే గ్రౌండ్‌ వాటర్‌, ఫుడ్‌, జీఎస్‌టీ, లేబర్‌, ఐఎస్‌ఐ, నో అబ్జక్షన్‌, కమర్షియల్‌ తదితర పది వరకు లైసెన్సులు ఉండాలి. ల్యాబ్‌, ప్లాంట్‌ సామాగ్రి, అనుమతులు తదితర వాటికి రూ.50 లక్షలకు పైనే ఖర్చవుతుంది. రూ. రెండు నుంచి మూడు లక్షలతో పెట్టిన ప్లాంట్లు ఐఎస్‌ఐ పేరిట చలామణి చేసేస్తున్నారు. గ్రామాల్లో రెండు నుంచి ఐదు వరకు ఆర్‌ఓ ప్లాంట్లు ఉండగా, పట్టణాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 700లకు పైనే మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. ఐఎస్‌ఐ ధృవీకరణ కలిగిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో ఓజేనేషన్‌ సిస్టమ్‌ తప్పనిసరి. అధికశాతం ప్లాంట్లలో కేవలం ఆర్‌ఓ టెక్నాలజి ద్వారా నీటిలోని మలినాలను మాత్రమే శుద్ది చేస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాక్టీరియాను శుద్ది చేసే యూవీ సిస్టమ్‌ లేదని తెలుస్తోంది. క్రమం తప్పకుండా పిల్టర్లు శుభ్రం చేయడం, నీటిలోని రంగు, ఐరెన్‌, హార్డ్‌నెస్‌, కాల్షియం, ఫ్లోరైడ్‌, మెగ్నీషియం, సల్ఫేట్‌ తదితర వాటి శాతం పరీక్షించే పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా బాట్లింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోపక్క వాటర్‌ ప్యాకెట్లు ప్యాకింగ్‌ కోసం నిర్ణీత మందం కన్నా పల్చటి కవర్లు వినియోగిస్తున్నారు. దీనివలన పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఎండ తీవ్రతకు కవర్‌లోని నీరు వేడెక్కి కెమికల్స్‌ నీటిలోకి చేరడం వలన ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది.

తూతూమంత్రంగా నీటి పరీక్షలు

ఆర్వో ప్లాంట్లపై అజమాయిషీ కరువు

అధిక శాతం ప్లాంట్లలో కానరాని యూవీ సిస్టమ్‌

జిల్లాలో చాపకింద ‘నీరు’లా మినరల్‌ నీటి వ్యాపారం

జిల్లాలో 700 ఆర్‌ఓ ప్లాంట్లు

‘కొద్దిరోజుల క్రితం పాలకొల్లు రూరల్‌ చిత్రాయి చెరువుగట్టు ఏరియాలో తాగునీరు కలుషితమై స్థానికులు 54 మంది చర్మ సంబంధిత సమస్యలకు గురైనట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. అధికారయంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి బాధితులకు వైద్యసేవలు అందించారు. వాటర్‌ ట్యాంకును క్లీన్‌ చేసి తాగునీటి సరఫరాలోని లోపాలను సరిచేశారు. జిల్లాలోని రక్షిత నీటి ట్యాంకులు, పైప్‌లైన్‌ లీకేజీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు’.

గ్రామీణ ప్రాంతాల్లో 20 లీటర్లు రూ. 5 నుంచి రూ. 20 వరకు, కూలింగ్‌ వాటర్‌ రూ.30కి అమ్మకాలు చేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లకు చేరవేస్తే రవాణ చార్జీలు అదనం. ప్లాంట్లలో నీటిని వాటర్‌ ప్యాకెట్లుగా, బాటిళ్లుగా ప్యాకింగ్‌ చేసి పాన్‌షాపుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. సాధారణ ప్లాంట్లలో రోజుకు రెండు లక్షలు చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ. కోటికి పైనే అమ్మకాలు జరుగుతాయని అంచనా. భారీ ఎత్తున జిల్లాలో మినరల్‌ నీటి అమ్మకాలు జరుగుతున్నా నీటి నాణ్యతను పరిశీలించే దిశగా స్థానిక సంస్థలు కనీసం శాంపిల్స్‌ కూడా సేకరించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement