జనసేన వర్సెస్‌ టీడీపీ | - | Sakshi
Sakshi News home page

జనసేన వర్సెస్‌ టీడీపీ

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కోట్లు దోచేసిన మోసగాళ్ల వ్యవహారం కాస్తా కూటమిలో కుంపట్లు రేపింది. ఉద్యోగాలకు నియామక పత్రాలు, సిఫార్సు లేఖలు, శిక్షణ తరగతులంటూ హల్‌చల్‌ చేస్తున్న లేఖలు బయటకు రావడంతో నిగ్గు తేల్చాలని ఒకరంటే, మాకేమీ సంబంధం లేదని మరొకరు పోలీసులకు చెప్పడం సంచలనంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర చూపించి కోట్లు గుంజేయడమే కాకుండా ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరుమీద ఫేక్‌ లెటర్‌ సృష్టించడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే మోసగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల వ్యవధిలో జనసేన నాయకులు తణుకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌, అత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆరవల్లి టీడీపీ నాయకులు అత్తిలి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని లక్షలు వసూలు చేశారంటూ మాపై అసత్య ప్రచారం చేశారని, టీడీపీ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు విచారణ చేసి అసలైన దోషులను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. సుమారుగా రూ.3 కోట్ల వ్యవహారంలో 50 మంది వరకు ఉన్న బాధితులు ఒక్కరూ కూడా బయటకు రాకపోవడంతో సదరు మోసగాళ్లు బాధితులను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

మార్మోగుతున్న ఆరవల్లి పేరు

తాజాగా అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన ఒక యువతి పేరుమీద ఉద్యోగానికి సంబంధించి అధికారులు, మంత్రుల పేరిట నకిలీ సిఫార్సు లేఖలు బయటకు రావడంతో సదరు యువతి సైతం శుక్రవారం బయటకు వచ్చి తాను ఉద్యోగం కోసం ఎవరినీ కలువలేదని, ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసిన వారిని పట్టుకోవాలని, ఫేక్‌ లెటర్స్‌ వ్యవహారం తేల్చాలని నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ ప్రధాన నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని ఆరవల్లి టీడీపీ నాయకులు చెప్పడం వంటి పరిణామాలు కూటమిలో విభేదాలకు ఆజ్యం పోశాయి.

నిగ్గు తేలేదెలా?

ఈ వ్యవహారంలో మోసపోయామని చెప్పాల్సిన బాధితులు ముందుకు రాకపోవడం, కూటమి నాయకులు ఒకరి తరువాత మరొకరు నిజం నిగ్గుతేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఆరవల్లి గ్రామంలోని వైఎస్సార్‌ కాలనీలో (ఇందిరమ్మ కాలనీ) ఫ్యాన్‌లు తిరగడంలేదని, లైట్లు సరిగా వెలగడం లేదంటూ మెరుగైన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకోసం ఏసీ ఉన్న ఇంటి నుంచి రూ.1500, ఏసీ లేని ఇంటి నుంచి రూ.300 చొప్పున డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో టీడీపీ నాయకులు పంచాయితీ చేసి తిరిగి ఎవరి డబ్బు వారి ఇళ్లకు పంపించారు. ఈ వ్యవహారంతో ఆరవల్లి టీడీపీ నాయకుల పరువు దిగజారడం ఆపై తాజాగా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం ఆరవల్లి చుట్టూ తిరగడంతో గ్రామస్తులు సైతం తలపట్టుకుంటున్నారు.

తణుకు నియోజకవర్గంలో హీటెక్కిన కొలువుల భాగోతం

నిరుద్యోగులను మోసం చేసిన వారిని శిక్షించాలని జనసేన డిమాండ్‌

మాకు సంబంధం లేదంటున్న ఆరవల్లి టీడీపీ నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement