తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవన వర్శిటీ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉత్పత్తులు తేనెపట్టు, మైనం ఆధారిత ఉత్పత్తులకు ఉద్యాన కళాశాలకు కేంద్రం మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ పేటెంట్ ఆఫీసు మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉద్యానవన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. వీఆర్‌గూడెం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్,ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో హర్టీకల్చర్ బీఎస్‌సీ చివరి సంవత్సరం విద్యార్థులు ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తేనెపట్టు, మైనం ఆధారంగా రూపొందించిన తేనెపట్టు పెయిన్‌బామ్, తేనెపట్టు మైనం దోమల నివారణ క్రీమ్, తేనెపట్టు మైనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ మూడు వినూత్న ఉత్పత్తులు ఈ పేటెంట్ సాధించాయి. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎన్‌బీవి.చలపతిరావు ,డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ప్రసన్నకుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.మాధవి, పరిఽశోధనా సంచాలకులు ఎం.రామానందం తదితరులు పాల్గొన్నారు.


