అధ్యాపకుల రాజీనామా
నూజివీడు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో ప్రేమ కవితలు పంపడం తాజాగా బయటపడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థునులతో అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకుల్లో ఓ అధ్యాపకుడు పీయూసీ విద్యార్థినికి వాట్సాప్‌లో పంపిన కవిత వెలుగుచూసింది. ఇలా ముగ్గురు అధ్యాపకులు పీయూసీకి చెందిన ముగ్గురు విద్యార్థునులతో నిర్వహించిన ప్రేమ కవితల పాఠాలు చూసి ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందాన్ని పొగడటం, మార్కులు వేస్తామంటూ ప్రలోభపెట్టడం, ఆపై లొంగదీసుకోవడం.. ఇవీ ట్రిపుల్‌ఐటీ ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ) నిర్వహించిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూసినట్టు సమాచారం.
విచారణ నివేదిక సమర్పణ
విద్యార్థినులపై అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకులపై నియమించిన ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ విచారణ నిర్వహించి, తమ నివేదికను ఈనెల 15న ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు ద్వారా చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తికి పంపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే కమిటీ నిర్వహించిన విచారణలో అనేక విషయాలు కమిటీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. తమకు లొంగిన విద్యార్థినులకు అనేక విధాలుగా ముగ్గురు అధ్యాపకులు సాయపడుతున్నట్టు తెలిసింది. ఐటీ మెంటార్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ అధ్యాపకులుండగా విద్యార్థినులకు మార్కులు ఎక్కువ వేయడం, పరీక్షకు హాజరు కాకపోయినా మార్కులు వేసేవారని ప్రచారం సాగుతోంది. ఒక సెక్షన్ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తుండటంతో మరో సెక్షన్ విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వేస్తున్నారని వారికి బోధించే అధ్యాపకులపై, మెంటార్లపై ఒత్తిడి చేసేవారు.
బయటపడిందిలా..
పీయూసీకి బోధించే ఒక మెంటార్ తరగతి గదిలో విద్యార్థినులతో ఒంటరిగా జీవించే మహిళలపై, భర్త లేని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఒక విద్యార్థిని తమ హాస్టల్ రూమ్ వద్దకు వచ్చిన డీఎస్‌డబ్ల్యూఓకు ఆ విషయాన్ని తెలియజేసింది. అంతేగాకుండా అదే రూమ్‌లో ఉండే తోటి విద్యార్థినితో చేస్తున్న వాట్సాప్ చాటింగ్ గురించి సైతం తెలిపింది. దీంతో డీఎస్‌డబ్ల్యూఓ, చీఫ్ వార్డెన్ (బాలికలు) కలిసి ఫోన్‌ను తీసుకుని పరిశీలించగా అనుచితంగా చేసిన చాటింగ్ బయటపడింది. దీంతో మరో ఇద్దరు విద్యార్థినులతో మరో ఇద్దరు అధ్యాపకులు సైతం ఇలాగే చాటింగ్ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆ విద్యార్థినులు దీనిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ మరింత లోతుగా విచారించడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి.
తమ బండారం బయటపడటంతో ఈ ముగ్గురు అధ్యాపకులు తమ కాంట్రాక్టు ఉద్యోగాలకు రాజీనామా చేసి క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. అలాగే ట్రిపుల్‌ఐటీ అధికారులు కూడా వారిని సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు నాలుగేళ్ల క్రితం హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడి ఆరు నెలల పాటు సస్పెండ్‌కు గురయ్యాడు. అయినా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా ఇప్పుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించి దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం ఏమి చర్యలు చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రేమ కవితలతో విద్యార్థినులతో చాటింగ్
మార్కులు ఎక్కువ వేస్తూ ప్రలోభాలు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల నిర్వాకం


