గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రోడ్డు ప్రమాదం

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రోడ్డు ప్రమాదం వాసునాయుడికి స్వర్ణ పతకం ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు తలనొప్పి తట్టుకోలేక మహిళ ఆత్యహత్య స్వమిత్వ సర్వే పనులు వేగవంతం చేయాలి

టి.నరసాపురం: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై వెళ్తున్న లారీకి డీజిల్‌ అయిపోవడంతో మండలంలోని శ్రీరామవరం సమీపంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. లారీ ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ ఆగిన లారీ వెనుక భాగంలో ఢీకొంది. ఆ వెనుకే వస్తున్న మరో లారీ ముందు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో చివరిగా ఢీకొన్న లారీలోని డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం అటవీశాఖ లాగింగ్‌ రేంజ్‌ ఎఫ్‌ఎస్‌వో నాగ వాసునాయుడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి చాటారు. శుక్రవారం థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 5 కిలోమీటర్ల రేస్‌ వాక్‌లో విజేతగా నిలిచారు. ఆయనకు అటవీ శాఖ అధికారులు, నాయకులు అభినందనలు తెలిపారు.

కుక్కునూరు: ఇసుకను తీసుకెళుతున్న లారీల నుంచి ఇసుక రోడ్డుపై పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాచారం గ్రామస్తులు శుక్రవారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి లారీల్లో ఇసుక రోడ్డుపై పడుతుందని, గ్రామాల్లో లారీలను నెమ్మదిగా నడపాలని గ్రామస్తులు లారీ డ్రైవర్లకు చెప్పినా వినకుండా వేగంగా నడపడంతో రోడ్డుపై ఇసుక పడి ద్విచక్ర వాహనదారులు ఇద్దరు ప్రమాదాలకు గురవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తమ రహదారి గుండా ఇసుక లారీలను నడవనివ్వమని అడ్డుకున్నారు. దీంతో లారీ యజమానులు ఈ సారి అటువంటి పొరబాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో లారీలను వదిలిపెట్టారు.

ఉండి: తలనొప్పి తట్టుకోలేక ఓ మహిళ ఆత్యహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి గ్రామానికి చెందిన గోడి సురేఖ(29)కు సుమారు 15 ఏళ్లుగా మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆసుపత్రిలో చూపించుకోకుండా ట్యాబ్‌లెట్స్‌ వేసుకుంటుంది.అయితే ఈ నెల 16న, గురువారం ఉదయం 11 గంటల సమయంలో తలనొప్పి విపరీతంగా రావడంతో దానిని తట్టుకోలేక మజ్జిగలో ఎలుకల మందు కలిపుకుని తాగింది. కొద్దిసేపటికి ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లు ఉండడంతో పరిస్థితిని గమనించిన ఆమె భర్త ఆరా తీయగా తాను ఎలుకలమందు తాగినట్లు చెప్పింది. దీంతో హుటాహుటిన ఆమెను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందిందిం. ఈ మేరకు మృతురాలి చెల్లెలు దిడ్ల రమ్య ఫిర్యాదుతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఏసయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో స్వమిత్వ సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల సర్వేయర్లతో స్వమిత్వ, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ తదితర అంశాలపై మండలాల వారీగా ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన స్వమిత్వ సర్వే పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement