ఊపందుకోని దాళ్వా మాసూళ్లు | - | Sakshi
Sakshi News home page

ఊపందుకోని దాళ్వా మాసూళ్లు

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

మూడో పంటకు

అవకాశం లేక రైతుల ఆందోళన

జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు

భీమవరం: ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో దాళ్వా మాసూళ్లు ఇంకా ఊపందుకోలేదు. దీంతో ప్రతి ఏటా మూడవ పంటగా వేసే పైరు పంటలు చేతికి వచ్చే అవకాశంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రతిఏటా సార్వా, దాళ్వా వరి పంటతో పాటు దాళ్వా మాసూళ్లు అనంతరం మూడో పంటగా మినుము, పెసర, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలతోపాటు పశుగ్రాసంగా పిల్లిపెసర, జనుము వంటి పంటలను పండించేవారు. అయితే ఈ ఏడాది దాళ్వానాట్లు ఆలస్యం కావడంతో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకుగానీ మాసూళ్లు ఊపందుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఈనెల 20వ తేదిన కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయనుండడంతో చేలల్లో పదునులేక పైరు, పశుగ్రాసం పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10 శాతమే వరి కోతలు పూర్తి

జిల్లా వ్యాప్తంగా 2.35 ఎకరాల్లో రైతులు ఎక్కువగా ఎంటీయూ 1121, పీఆర్‌ 126 వంటి వరి రకాలను పండిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం ప్రాంతాల్లో పంట మాసూళ్లు ముమ్మరంగా సాగుతుండగా మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 50 బస్తాల ధాన్యం దిగుబడి వస్తున్నందున జిల్లాలో సుమారు 9.5 లక్షట మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని దానిలో 7.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

మూడో పంటకు విరామం

దాళ్వా వరి పంట పెట్టుబడులు పెరగడంతోపాటు రైతులకు ఎంతో కొంత ఆదాయం వచ్చే మూడో పంటకు అవకాశం లేకపోవడంతో దాళ్వాలో నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement