జంగారెడ్డిగూడెం: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మండలంలోని కేతవరంలో ఓ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన ముగ్గళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతన్ని నుంచి 102 గ్రాముల బంగారు వస్తువులు, రూ.12820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ముగ్గళ్ల శ్రీనివాసరావుపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లలో 20 కేసులు ఉండగా, జంగారెడ్డిగూడెం స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందన్నారు. అలాగే మోటార్ సైకిల్‌చోరీ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. మండలంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 14న పార్క్ చేసి ఉంచిన తన మోటార్‌సైకిల్ చోరీకి గురైంది. దీనిపై బాధిడుతు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టామన్నారు. విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ రహీమ్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు తేలిందన్నారు. ఇతను ప్రస్తుతం చింతలపూడిలో నివాసం ఉంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు రహీమ్‌ను విచారించగా, 6 మోటార్‌సైకిళ్లు, ఒక ఆటో చోరీ చేసినట్లు తెలిపాడన్నారు. లక్కవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్‌స్టేషన్‌ల పరిదిలో 4 మోటార్ సైకిళ్ల, తెలంగాణ రాష్ట్రం అశ్శారావుపేటలో ఒక మోటార్‌సైకిల్, భద్రాచలం ఒక ఆటోను రహీమ్ చోరీ చేశాడన్నారు. మొత్తం ఈ వాహనాలన్నీ నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశామన్నారు. కాగా, నిందితుడు రహీమ్ ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన తిక్కిరెడ్డి శ్రీను వద్ద 3 మోటార్ సైకిళ్లు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. దీంతో తాకట్టు పెట్టుకుని తిక్కిరెడ్డి శ్రీనుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, జంగారెడ్డిగూడెం, లక్కవరం ఎస్సైలు ఎన్‌వీ ప్రసాద్, షేక్ జబీర్, సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఈ రెండు కేసులను చేధించిన సీఐ, ఎస్సైలు, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, షేక్ షానుబాబు, బి.మంగారావు, కె.మహేష్‌లను అభినందించి వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు.


