జాతరలో ఘర్షణ.. వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

జాతరలో ఘర్షణ.. వృద్ధుడి మృతి

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

యలమంచిలి: ప్రశాంతంగా ఉండే గోదావరి తీరంలో కొందరి అల్లరిమూకలు మత్తు పదార్థాలు తీసుకుని చేసిన అల్లరి వల్ల దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం బూరుగుపల్లి గ్రామ దేవతలు బూరుగులమ్మ, మారెమ్మ, నూకాలమ్మ అమ్మవార్ల జాతర గురువారం రాత్రి చేశారు. ఈ జాతరలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన బోనం శ్రీరామకృష్ణ, బోనం గణేష్‌ల మధ్య వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గణేష్‌ భీమవరం ప్రాంతం నుంచి కొంతమంది రౌడీషీటర్లను తీసుకుని జాతరలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. జాతర ప్రారంభమవుతున్న సమయంలో రోడ్డుపై కార్లు నిలపడంతో స్థానికులు కారులు తీయాలని కోరారు. కారులు తీయకపోగా మత్తు పదార్థాలు తీసుకుని కారు పైకి ఎక్కి కొంత సమయం హల్‌చల్‌ చేశారు. దీంతో ఎస్సై కర్ణీడి గుర్రయ్య, పోలీసులు రంగప్రవేశం చేసి కారు తీయాలని చెప్పిన పట్టించుకోలేదు. పోలీసులు అక్కడ ఉండగానే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్‌ పలివెల భరత్‌ కారును మితిమీరిన వేగంతో నడిపి దేవరపు వీరాస్వామి(75)ని ఢీ కొట్టాడు. దీంతో గాయపడిన వీరాస్వామిని దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

వాహనంపై రాళ్లు రువ్విన వైనం

వీరాస్వామిని మెరుగైన చికిత్స కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా తాడిమెరక వద్ద ఆసుపత్రికి వెళ్తున్న వాహనంపై రాళ్లు మద్యం సీసాలతో మరొకసారి దాడి చేశారు. ఆఖరికి దాడి నుంచి తప్పించి వీరాస్వామిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు వీరాస్వామికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసుల సమక్షంలో రాళ్లతో రువ్వుకోవడం, కారుతో ఢీ కొట్టడం, ఆసుపత్రికి తరలిస్తున్న వాహనంపై కూడా దాడి చేయడం వంటి ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బోనం గణేష్‌తో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పాలకొల్లు రూరల్‌ సీఐ గుత్తుల శ్రీనివాస్‌ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కర్ణీడి గుర్రయ్యపై సస్పెన్షన్‌ విధిస్తూ ఎస్పీ నయీం అస్మీ ఆదేశాలిచ్చినట్లు ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement