పెద్దవాగు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

పెద్దవాగు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదు

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

వేలేరుపాడు: పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వేలేరుపాడు మండల తహసీల్దార్‌ కార్యాలయం వరకు 21 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నా, వేలాది కుటుంబాలు దాహానికి అల్లాడిపోతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు.

ఏడు మండలాలను పట్టించుకోవాలి

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్న పాలకులకు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత లేదా..? ప్రశ్నించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరుగుతూ రెండు సంవత్సరాలుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ చైతన్య, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement