తణుకు అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కొత్తగా తీసుకువచ్చిన ఫేస్‌యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తేతలి గ్రామం కొండయ్య పాలెం రోడ్డులో పని చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్న కారణంగా చాలా చోట్ల పని ప్రదేశాల్లో హాజరు నమోదు కాకపోవడంతో అత్యధిక మంది కూలీలు పని కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. కూలీలు చేసిన పనికి ఇచ్చే నామమాత్రపు వేతనానికి రెండు పూటలా పని చేయాలని షరతులు విధించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న విజయవాడ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధి కూలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
భీమవరం: ఆకివీడు పెదపేట రామాలయం విషయంలో వివాదంపై శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు ఆకివీడు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భీమవరంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో సీఐలు నాగ రాజు, కాళీచరణ్, శ్రీనివాస్, ఎస్సై రామారావు, కిరణ్ కుమార్‌తో పాటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని సూచించడంతో బహుజన సమాజ్ పార్టీ నాయకులు భీమవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులు, దళిత క్రిస్టియన్లపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.


