ప్రాధాన్యత లేని పదోన్నతి
తోటకు తీవ్ర అవమానం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ కమిటీలో సీనియర్లకు ఉద్వాసన పలికారు. తమ్ముళ్లూ.. మీ సేవలు ఇక చాలు.. సర్దుకోండని పొమ్మనకుండా పొగపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవుల్లో పనిచేసిన నేతలకు సైతం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి కరెన్సీ, పరపతి బలంగా ఉన్న నేతలకు పదవులు కట్టబెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యాయం మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టడం, ఏలూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిని సైడ్ చేయడం ఇలా కీలక నేతలందరిని పక్కకు సర్దేయడంపై అసమ్మతి స్వరం రేగింది.
కీలక నేతలకు దక్కని పదవులు
టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల్లో జిల్లాలో కీలక నేతలకు పార్టీ పదవులు దక్కలేదు. సామాజిక కోణంలో కరెన్సీ లాబీయింగ్ చేసే కొందరు నేతలకు, అలాగే నియోజకవర్గాల్లో పెద్ద పరిచయాలు లేకుండా పార్టీ కార్యాలయాల్లోనే మకాం వేసే నేతలకు పదవులు దక్కాయి. మళ్లీ యథావిధిగా యూజ్ అండ్ త్రో అనే పాలసీ ప్రకారమే పార్టీలో పదవుల పంపిణీ జరిగిందనే ప్రచారం తెరలేచింది. ఉమ్మడి పశ్చిమలో ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సిఫార్సులకు నామమాత్రపు ప్రాధాన్యత లేకపోవడం, జిల్లాలో బడా నేతలుగా హడావిడి చేస్తూ పార్టీలో పదవులు పొందే విషయంలో కొందరికి పరపతి లేకపోవడం హాట్‌టాఫిక్ మారింది. సామాజిక కోణంలో అన్ని వర్గాలను కలుపుకుని పదవులు ఇచ్చామని ప్రకటించుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం. ఇక టీడీపీలో సర్వం తామే అంటూ నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఎవరూ ఊహించని రీతిలో జిల్లాకు చెందిన కొందరు జాతీయ కమిటీలో పదవులు పొందడంపై సదరు నేతలు కూడా అవాక్కవడం గమనార్హం.
ఇక అధికార పార్టీలో మరో చర్చ కొనసాగుతోంది. నూజివీడు టిక్కెట్ ఆశించి భంగపడ్డ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ, అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసి యథావిధిగా హ్యాండ్ ఇచ్చారు. చివరికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్టీ పదవి ఇచ్చామంటూ కొత్త కలరింగ్‌తో హడావిడి చేస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకు సామాజిక కోణంలో భీమవరం కోటా నుంచి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. అలాగే టీడీపీలో మొదటిసారి గెలిచిన జూనియర్ ఎమ్మెల్యే మద్దిపాటికి రీజనల్ కోఆర్డినేటర్‌ను సామాజిక కోణంలో కట్టబెట్టారు. ఉమ్మడి పశ్చిమ నుంచి పొలిట్ బ్యూరోలో నిమ్మల రామానాయుడు, మహహ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, పితాని సత్యనారాయణలకు చోటు దక్కింది.
తెలుగు తమ్ముళ్లకు ఝలక్
సీనియర్లూ.. ఇక సర్దుకోండి
భీమవరంలో తోట సీతారామలక్ష్మి, దెందులూరులో చింతమనేనికి మొండిచేయి
ఎంపీ పుట్టా సిఫార్సులూ.. బుట్టదాఖలే
ఎన్నికల వరకే సామాజిక కోణంలో పదవుల పంపిణీ
టీడీపీలో కొనసాగుతున్న యూజ్ అండ్ త్రో పాలసీ
ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గ నేతలకు దక్కని పదవులు
టీడీపీ కమిటీపై సర్వత్రా విమర్శల వెల్లువ
మాజీ ఎంపీ, పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టారు. జాతీయ కమిటీ మొదలుకొని రాష్ట్ర స్థాయి కమిటీ వరకు దేనిలోనూ ప్రాధాన్యం దక్కలేదు. భీమవరం కేంద్రంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ కాపు సామాజిక కోణంలో ఆమె బలమైన నేతగా పశ్చిమలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ప్రస్తానం ప్రారంభించి ఎంపీ వరకు పనిచేసి ప్రస్తుతం ఏ పదవి లేకుండా మిగిలిపోయారు. ఇక నర్సాపురంలోనూ ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న బండారు మాధవనాయుడు, రామరాజుకు పూర్తిగా మొండిచెయ్యి చూపారు. అలాగే ఏలూరు జిల్లాలో 4 వ సారి గెలిచిన చింతమనేనికి రాష్ట్ర కమిటీలో చిన్నపాటి పదవి కూడా పేరు పరిగణనలోనికి తీసుకోకపోవడం జిల్లాలో చర్చగా మారింది. అలాగే పాలకొల్లు నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న అంగర రామ్మోహన్‌కు గతంలో ఇరిగేషన్ బోర్డు సభ్యుడిగా పదవిని ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ లేఖ ద్వారా తాను ఈ పదవి తీసుకోలేనని తన స్థాయికి తగిన పదవి కాదంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. మళ్లీ యథావిధిగా రాష్ట్ర కమిటీలో అంగర రామ్మోహనరావును అవమానించి 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు. ఇక ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు మొండిచెయ్యి చూపారు. నిత్యం పార్టీ కండువా వేసుకుని తిరిగే గన్నిని పార్టీ పట్టించుకోకపోవడం విశేషం. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పదవి దక్కలేదు. ఏలూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలను కనీసం పట్టించుకోలేదని చర్చ సాగుతోంది. ఇక అంతా తానే అన్నట్లు నిన్న, మొన్నటి వరకు హడావిడి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుకై ్క నియోజకవర్గంలో తలెత్తుకు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఏలూరుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే కొద్ది నెలల ముందే పదవులకు సంబంధించి ఎంపీ కొన్ని సిఫార్సులు చేశారని వాటన్నింటిని బుట్టదాఖలు చేసినట్లు సమాచారం.


