ఆక్వా రంగం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రంగం అభివృద్ధికి కృషి

Apr 17 2026 10:20 AM | Updated on Apr 17 2026 1:32 PM

ఆక్వా రంగం అభివృద్ధికి కృషి

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ బిజయ్‌ కుమార్‌ బెహన్‌ తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌ క్లస్టర్‌’’ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్లలో క్లస్టర్‌ సాధించిన పురోగతి, ఇంకా చేపట్టాల్సిన చర్యలను ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర సెక్రటరీ డాక్టర్‌ అభిలక్ష్‌ లిఖీ మాట్లాడుతూ ఆక్వాకల్చర్‌ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రొయ్యల సాగులో ఆధునిక సాంకేతికతలను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు 83 శాతం తమ చెరువులను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఇంకా 17 శాతం రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉందన్నారు. ముందుగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆక్వా ఎక్స్ఛేంజ్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర పరికరాల ప్రదర్శనను అధికారులు పరిశీలించారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రామ శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ నాగరాణి మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement