న్యూస్‌రీల్
సొంతింటి కల సాకరం
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఎట్టకేలకు గృహప్రవేశాలు చేయించారన్న ఆనందం టిడ్కో లబ్ధిదారులకు క్షణకాలం నిలవలేదు. మార్చి 30న జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలలోని 5,056 ఫ్లాట్లలోకి సామూహిక గృహప్రవేశాలు చేయించినా ఇంత వరకు లబ్ధిదారులకు ఫ్లాట్లు స్వాధీనం చేయలేదు. విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక పరమైన పనులు పూర్తిచేయకపోడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 2016లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అందరికీ ఇళ్లు పథకానికి భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో 21,424 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. టౌన్ షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) పర్యవేక్షణలో షీర్‌వాల్ టెక్నాలజీ పద్దతిలో నాటి టీడీపీ ప్రభుత్వం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. 2019 ఎన్నికలకు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ఫ్లాట్ల నిర్మాణం, మౌలిక వసతుల పనులు పూర్తికాకుండానే అప్పట్లో హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయించి చేతులు దులుపుకుంది.
కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. టిడ్కో లబ్ధిదారులకు మిగిలిన ఫ్లాట్ల అప్పగింత కోసం శ్రావణ మాసం, వంద రోజుల పండుగ, ఏడాది పాలన అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు మార్చి 30న పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ప్రభుత్వం సామూహిక గృహప్రవేశాలు చేయించింది. సొంతింటి కలను సాకారం చేశామంటూ పాలకులు చెప్పుకొచ్చారు. ఇక ఫ్లాట్లలోకి వెళ్లడమే తరువాయి అనుకున్న లబ్ధిదారుల ఆశలపై అసంపూర్తి పనులు నీళ్లు చల్లుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, తాగునీరు తదితర మౌలిక పనులు ఇంకా పూర్తికాక నివాసయోగ్యంగా లేవు. వాటర్ పైపులైన్లకు సంబంధించిన వాల్వులను దొంగలు ఎత్తుకెళ్లడంతో కొత్తవి ఏర్పాటుచేయాల్సి ఉంది. మూడు పట్టణాల్లోని టిడ్కో సముదాయాల వద్ద ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేలమంది సామూహిక గృహప్రవేశాలు చేసినప్పటికి ఫ్లాట్లు స్వాధీనం చేయక టిడ్కో సముదాయాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నామని, నెలనెలా ఇంటి అద్దెలకు తోడు ఫ్లాటు కోసం బ్యాంకులు ఇచ్చిన రుణాల వాయిదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు అంటున్నారు. పనులు పూర్తికానప్పుడు గృహప్రవేశాలు చేయించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా భీమవరంలో ఫ్లాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు విద్యుత్ మీటరుకు దరఖాస్తు చేసుకుని కనెక్షన్ తెచ్చుకుంటే తాళాలు స్వాధీనం చేస్తామని నిర్మాణసంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
‘పాలకొల్లులో ఆర్భాటంగా 2,016 ఫ్లాట్లలోకి గృహప్రవేశాలు చేయించినా ఇంతవరకు ఒక్క ఫ్లాటు తాళం కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. స్వయంగా మంత్రులు దగ్గరుండి గృహప్రవేశం చేయించిన ఫ్లాట్ల పరిస్థితి అంతే. బ్లాకుల వద్ద ట్రాన్‌న్స్‌ఫార్మర్లు పూర్తి స్థాయిలో అమర్చకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లకు విద్యుత్ సౌకర్యం లేదు. డ్రెయినేజి వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మించలేదు. తలుపులు పాడైపోయాయి’.
‘భీమవరం టిడ్కో సముదాయంలో 1920 ఫ్లాట్లలో ఇటీవల సామూహిక గృహప్రవేశాలు అంటూ హాడావుడి చేశారు. రెండు వారాలైనా ఒక్కరికి ఫ్లాటు అప్పగించలేదు. ఇంకా పనులు జరుగుతున్నాయని, ఫ్లాటు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని టిడ్కో సిబ్బంది చెబుతున్నట్టు లబ్ధిదారులు అంటున్నారు. ఫ్లాట్ల వద్ద ఇంకా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా లబ్ధిదారులు ఇంకా ఫ్లాట్లలోకి అడుగు పెట్టకుండానే గోడలు, స్లాబులు పగుళ్లు తీస్తుండటం, గుమ్మాలకు చెదలు పట్టి పాడైపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి’.
‘తాడేపల్లిగూడెంలోని 1,120 ఫ్లాట్లలో సామూహిక గృహప్రవేశాలు చేశారు. వాటర్ ట్యాంకు నిర్మాణం చేసినప్పటికి బోరు పని పూర్తికాలేదు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవడం, ఇతర మౌలిక సమస్యలతో నివాస యోగ్యంగా లేవు. దీంతో లబ్ధిదారులు ఫ్లాట్ల వద్దకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.’
టిడ్కో లబ్ధిదారులతో కూటమి ఆటలు
భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో 5,056 ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు
విద్యుత్, తాగునీటి పనులు పూర్తిచేయకుండానే హడావుడి
ఇప్పటికీ ఒక్కరికి ఫ్లాటు అప్పగించని వైనం
వైఎస్సార్‌సీపీ హయాంలో పనులు పూర్తిచేసి 8,736 మందికి అప్పగింత
టిడ్కో ఫ్లాట్ల వద్ద పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ చూపింది. తాగునీరు, సెప్టిక్ ట్యాంకు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులతో నివాసయోగ్యంగా పనులు పూర్తయిన మేర జిల్లాలోని 8,736 ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించారు. 2019 ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే 300 చ.అ ఫ్లాట్లను లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఇవ్వగా, 365 చ.అ కేటగిరీలో లబ్ధిదారుల డిపాజిట్ సొమ్ము రూ. 50 వేలలో రూ. 25 వేలు, 430 చ.అ కేటగిరీలోని లబ్ధిదారుల డిపాజిట్ సొమ్ము రూ.లక్షలో రూ.50 వేలు మినహాయింపునిచ్చారు.


