భీమవరం: పోలీస్ స్టేషన్లకు వివిధ సమస్యలతో వచ్చే బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ బాఽధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా 20 ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: పేదలకు అండగా ఉంటామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ డి.కళ్యాణి ప్రశ్నించారు. భీమవరంలో సోమవారం నిర్వహించిన శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సుకు చింతపల్లి లక్ష్మి, ఆర్.భాగ్యలక్ష్మి, గోవిందమ్మ అధ్యక్షత వహించారు. సదస్సులో కళ్యాణి మాట్లాడుతూ అన్నిరంగాల్లో సగ భాగంగా ఉన్న మహిళలకు నేటికీ సరైన గుర్తింపు లేదని, సమాన పనికి సమాన వేతనం లేకపోగా ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు వంటి అనేక సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో గంటల తరబడి నిలబడే పనిచేయాల్సి వస్తుందని కనీసం వసతులు కల్పించడం లేదని వాపోయారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు అరికట్టడం వంటి వాటికి సీఐటీయు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.
తణుకు అర్బన్: వ్యాపారస్తులు తమ వ్యాపార రవాణాలో ఆర్టీసీ కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమర్షియల్ మేనేజర్ జీఎల్‌పీవీ సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం తణుకు కార్గో సెంటర్ తనిఖీకి వచ్చిన ఆయన పట్టణంలోని మామిడికాయల వ్యాపారులు, ఇతర పండ్ల వ్యాపారులను కలిసి కార్గో ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో కొత్తగా ఏజెంట్‌ను నియమిస్తున్నట్లుగా చెప్పారు. గతేడాది కన్నా ఈ ఏడాది తణుకు కార్గో ద్వారా డిపోకు రూ. 24 లక్షలు అధికంగా ఆదాయం వచ్చిందని, కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు డిపో అత్యధిక డోర్ డెలివరీ బుకింగ్ చేసిందని స్పష్టం చేశారు. తణుకు కార్గో కార్యాలయంలో రెండో బుకింగ్ కౌంటర్ ప్రారంభిస్తామని అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్‌జీయూకేటీ)లో పీయూసీ విద్యార్థినులను వేధిస్తున్న అధ్యాపకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే.లెనిన్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినులకు అనుచిత సందేశాలు పంపుతూ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా, కేవలం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి విచారణ అప్పగించి, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి కాలయాపన చేస్తోందన్నారు.


