పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టుబేసిక్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్ హై ఆల్టిట్యూడ్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాహస యాత్రకు బయలుదేరుతున్న విద్యార్థిని ప్రత్యేకంగా సోమవారం అభినందించారు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సత్యనారాయణ చదువులో చురుగ్గా ఉంటాడు. దీంతో పాటు విలీన ఉపాధ్యాయిని సాయి స్వరూప బోధనలో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. సాయి స్వరూప మాట్లాడుతూ డిసెంబర్ 26న అమలాపురం, కడపలో జరిగిన శిక్షణలో ప్రతిభ చూపిన సత్యనారాయణ గండికోట అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. తుది స్దాయిలో రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు.
ద్వారకాతిరుమల: అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావును ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలతో ఈఓగా నియమిస్తూ సోమవారం జీఓ జారీ చేశారు. త్రినాధరావుకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఆయన హయాంలోనే క్షేత్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. మళ్లీ బదిలీపై ఈయన శ్రీవారి దేవస్థానానికి ఈఓగా నియమితులు కావడం పట్ల ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.


