జంతువుల కదలికలు గుర్తించే ట్రాప్ కెమెరా
బుట్టాయగూడెం: అభయారణ్యాల్లో జంతువుల కదలికలు, సంరక్షణ, లెక్కింపు కోసం అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఉపయోగిస్తారు. ఈ కెమెరా ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతంలో ఏదైనా జంతువు, మనుషుల కదలికలు, ఉష్ణోగ్రతలో మార్పు జరిగినప్పుడు మోషన్ సెన్సార్ ద్వారా ఆటోమెటిక్‌గా ఫొటోలు, వీడియోలు తీస్తుంది. జంతువులు తాగునీటి కోసం వచ్చే ప్రదేశాలను గుర్తించి అక్కడికి దగ్గరగా ఉన్న చెట్లకు ట్రాప్ కెమెరాలను అమరుస్తారు. పగలు, రాత్రి వేళల్లో అక్కడికి వచ్చే జంతువులు కెమెరా ముందుకు వెళ్తే ఆటోమెటిక్‌గా చిత్రాలు తీస్తాయి. గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, గేదెలపై దాడి చేస్తే జంతువులను ఈ ట్రాప్ కెమెరా ద్వారా గుర్తిస్తారు. గత ఐదురోజులు గిరిజన ప్రాంతంలోని గ్రామాల్లో ప్రజలను, ఫారెస్టు అధికారులు కంటి మీద కునుకు లేకుండా చేసి సుమారు ఆవులు, గేదెలపై దాడి చేసి చంపిన పెద్దపులిని ఈ ట్రాప్ కెమెరానే స్పష్టమైన ఫొటోలు తీసింది.
ట్రాప్ కెమెరాతో గుర్తింపు
పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతోపాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం, వీఆర్‌పురం, చింతూరు మండలాలను కలిపి సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ పాపికొండల అభయారణ్యంలో పులులు, చిరుతలతోపాటు అరుదైన పక్షులు, విలువైన వృక్ష సంపద ఉంది. ఈ అభయారణ్యంలో ప్రతి నాలుగేళ్లకొకసారి ట్రాప్ కెమెరాల ద్వారానే జంతుగణన నిర్వహిస్తారు. 2018, 2022లో జంతుగణన నిర్వహించారు. ఆ సమయంలో 116 ప్రాంతాల్లో 2,032 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. ఈ సర్వేలో అన్ని రకాల జంతువులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం జంతుగణన జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 130 ప్రాంతాల్లో 300కుపైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతుగణన చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.


