సంక్రాంతి నిలువు దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్) : సంక్రాంతి పండుగ వేళ అన్నిరకాల దోపిడీతో సామాన్యుడు విలవిలలాడాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, హోటల్ గదుల అద్దెలు, బరుల వద్ద మద్యం విక్రయాల ధరలతో బెంబేలెత్తాడు. సంక్రాంతికి సొంతూరుకి వచ్చి వెళ్లేందుకు అయిన ఖర్చుతో నిండా ఢీలా పడ్డాడు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగింది.
ట్రావెల్స్ ‘దారి’ దోపిడీ
సంక్రాంతి పేరుతో ఈనెల 9 నుంచి ఆదివారం వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ధరల దోపిడీ దందా సాగింది. ఆర్టీసీ టికెట్ హైదరాబాద్ నుంచి భీమవరానికి రూ.730 ఉంటే దానిపై 50 శాతం మాత్రమే పెంచాలని రవాణా శాఖ అధికారులు సూచించగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలు మీరి బస్సుల స్థాయిలను బట్టి టికెట్‌కు రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకూ వసూలు చేశారు. ఈ ధరలను చూసిన కొందరు సొంత వాహనాల్లో జిల్లాకు చేరుకున్నారు. రవాణా శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన 54 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.5.40 లక్షలు, సరైన రికార్డులు లేని 38 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.68,300 అపరాధ రుసుం విధించారు.
హోటల్ రూమ్స్‌కు కృత్రిమ డిమాండ్
జిల్లాలోని భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర పట్టాణాల్లో హోట ల్స్ గదులకు కృత్రిమ డిమాండ్ సృష్టించి అద్దెలు భారీగా పెంచేశారు. దూరప్రాంతాల నుంచి జి ల్లాకు వచ్చి బంధువుల ఇళ్లలో వసతులు సరిగా లేనివారు హోటళ్లు, లాడ్జీలను ఆశ్రయించారు. దీంతో వీటి అద్దెలకు రెక్కలు వచ్చాయి. సాధారణ రోజు ల్లో రూ.1,500 నుంచి రూ.2,500 ఉండే అద్దెలు పండుగ రోజుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ పెంచేశారు. మూడు రోజుల ప్యాకేజీ కింద వసతులను బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేలకు వసూలు చేశారు. హోటళ్ల యాజమానులు ఇష్టానుసారంగా అద్దెలు పెంచినా జిల్లా అధికారులు కనీసం పట్టించుకోలేదు.
తాడేపల్లిగూడెం హైవేపై తనిఖీలు
భీమవరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు
భీమవరానికి చెందిన వెంకటేశ్వరావు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగి. సంక్రాంతికి సొంతూరుకు వచ్చేందుకు రైలు టికెట్లు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. రానూపోనూ చార్జీలు రూ.25 వేలు అయ్యాయి. వెంకటేశ్వరరావు జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే సరిపోయింది. అదే సాధారణ రోజుల్లో అయితే రూ.5 వేల నుంచి రూ.7 వేలతో సరిపోయేది.
పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన బాలదుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ట్రైన్ టికెట్లు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్ కోసం ప్రయత్నిస్తే రూ.3 వేలు చెప్పారు. రానూ పోనూ రూ.6 వేలు అవుతుందని భావించి తన బైక్‌పై సొంతూరు వచ్చి వచ్చాడు. ఇందుకు రూ.2,500 మాత్రమే ఖర్చయ్యింది.
చుక్కలు చూపించినపెద్ద పండుగ
ట్రావెల్స్ బస్సుల్లో చార్జీల బాదుడు
హైదరాబాద్‌కు టికెట్ రూ.6 వేల వరకూ..
హోటల్ గదుల అద్దెలు నాలుగు రెట్ల పెంపు
బరుల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
రూ.100 వరకు అదనపు వసూలు
ధరలను నియంత్రించాల్సిన అధికారుల చర్యలు శూన్యం
సంక్రాంతి నిలువు దోపిడీ


