సంక్రాంతి జూదాల్లో యువత చిత్తు
రూ.100 కోట్ల వరకు వ్యాపారం
● అప్పులు చేసి మరీ పోగొట్టుకున్న జనం
● కోడి పందేలు, గుండాట, పేకాటపై రూ.100 కోట్ల వరకూ వ్యాపారం
భీమవరం (ప్రకాశం చౌక్) : సంక్రాంతి జూదాల్లో యువతను చిత్తయ్యారు. అప్పులు చేసి జూదం ఆడిన యువత ఓడిపోయింది. సంక్రాంతి మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందేలు, గుండాట, పేకాటల్లో పాల్గొని డబ్బు పొగొట్టకున్న వారిలో అధిక సంఖ్యలో యువతే.. సంక్రాంతి మూడు రోజులు కోడి పందేలు, గుండాటలో జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగులు, వ్యాపారం చేస్తున్న యువత డబ్బు లెక్క చేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చోట్ల అమ్మాయిలు కూడా తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందాలు, గుండాటల్లో డబ్బులు పొగొట్టుకున్నారు. గతంలో యువత సంక్రాంతికి ఏర్పాటు చేసే క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడాల్లో ఎక్కువగా పాల్గొనేది. రాను రాను యువత సంక్రాంతికి క్రీడల్లో కాకుండా కోడి పందేలు, గుండాట వైపు మళ్లుతున్నారు. ఈ సంక్రాంతి మూడు రోజులు అదే జరిగింది. జిల్లాలో ఎక్కడ ఏ కోడి పందేల బరి చూసినా యువత ఎక్కువగా కనిపించింది.
అప్పు ఎలా తీర్చాలి?
జూదాల్లో డబ్బు గెలిచిన కొందరు సంతోషంగా ఉండగా డబ్బు పొగొట్టుకున్న యువకుల్లో అప్పులు తీర్చడంపై ఆందోళన మొదలైంది. రూ.వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులు ఉన్నాయి. లోన్ యాప్‌లు, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడితో యువకులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. పండగ అంటే కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన క్షణాలు. సంక్రాంతి జూదాల్లో డబ్బు పొగొట్టుకున్న యువత ఏడాదంతా కష్టపడినా అప్పు తీర్చగలమా? అనే ఆందోళనలో ఉన్నారు.
భీమవరం బరి వద్ద గుండాట
భీమవరంలో జోరుగా కోడి పందేలు
భీమవరానికి చెందిన చైతన్య (పేరు మార్చాం) హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగి. సంక్రాంతికి సొంతూరు వచ్చి కోడి పందేల్లో పాల్గొని రూ.లక్ష వరకు పోగొట్టుకున్నాడు. రెండు నెలల జీతం సొమ్మును కేవలం మూడు రోజుల్లో జూదాల్లో సమర్పించుకున్నాడు. సంక్రాంతి మూడు రోజులు ఎంజాయ్ చేయడం ముఖ్యమే కాని డబ్బు పొగొట్టుకునేలా ఎంజాయ్ చేయడం సరికాదు అని డబ్బులు పోయాక చెబుతున్నాడు.
భీమవరానికి చెందిన మరో యువకుడు ప్రైవేట్ ఉద్యోగి. జీతం తక్కువైనా కోడి పందేలు, గుండాట కోసం అప్పు చేశాడు. అప్పు చేసిన వేల రూపాయిలు పొగొట్టుకున్నాడు. పందేల్లో వచ్చిన దాని కంటే పోయిన సొమ్ము ఎక్కువగా ఉండడంతో చేసిన అప్పు తీర్చడం కోసం ఆందోళన పడుతున్నాడు.
జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల జరిగిన కోడి పందేలు, గుండాటలు, ఇతర జూదాల్లో రూ.80 నుంచి రూ.100 కోట్లకు పైగా నగదు, ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం జరిగింది. ఈ జూదాల వ్యాపారంలో 70 శాతం మంది యువత డబ్బు పొగట్టుకుంటే 10 శాతం మంది యువత పందేల్లో డబ్బులు సంపాదించారు. యువత రూ.70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకూ పందేల్లో కాసింది. జేబుల్లో డబ్బు లేని వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా మనుషులను పెట్టి క్యాష్ ఏర్పాటు చేయించారు. ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యం కల్పించి నగదు అందించేవారు. పలు రకాల లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని పందేలు కాశారు. మరికొందరు అధిక వడ్డీకి అప్పులు చేశారు. వస్తువులు తాకట్టుపెట్టి మరి డబ్బు పొగొట్టుకున్నారు.
సంక్రాంతి జూదాల్లో యువత చిత్తు


