లిప్‌స్టిక్ పంటకు గిరాకీ
జాఫ్రా గింజలకు డిమాండ్
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో జాఫ్రా (లిప్‌స్టిక్ గింజల) సాగు క్రమంగా పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెంకు చెందిన గిరిజన రైతు జాఫ్రా సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించడంతో పంట సాగుపై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పలు గ్రామాల్లో జాఫ్రా సాగును చేపట్టారు. స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు జాఫ్రాపై మక్కువ చూపుతున్నారు.
విస్తరిస్తున్న సాగు
మన్యంలో 5 సంవత్సరాల క్రితం మూడున్నర ఎకరాల్లో రైతు జాఫ్రా పంటను వేసి అధిక దిగుబడులు సాధించాడు. అమ్మపాలెం, వంకబొత్తప్పగూడెం గ్రామాల్లో కూడా సుమారు 24 ఎకరాల్లో రైతులు జాఫ్రా సాగును చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 27 ఎకరాలకు పైగా జాఫ్రా పంట సాగు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి పంట కోత పనుల్లో రైతులు నిమగ్నమవుతారు. ప్రస్తుతం రైతుల ఇళ్లల్లో విక్రయానికి లిప్‌స్టిక్ గింజలు నిల్వ ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాకు రూ.60 వేలు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పలు జిల్లాలకు మొక్కలు సరఫరా
బుట్టాయగూడెం మండలంలో పంట సాగుతోపాటు మొక్కల నర్సరీని గిరిజన మహిళా రైతు వెంకాయమ్మ, జంపాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాలకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, తదితర ప్రాంతాలకు సుమారు లక్షన్నర మొక్కల వరకూ సరఫరా చేసినట్లు రైతులు తెలిపారు.
నేను పొగాకు, మామిడి, జీడిమామిడి, ప్రత్తి, మొక్కజొన్న వంటి పంటలు పండించాను. సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడేవాడిని. ప్రత్యామ్నాయ పంటగా జాఫ్రా పంటను మూడున్నర ఎకరాల్లో పండించా. గత ఏడాది క్వింటాకు రూ.60 వేల వరకూ వచ్చింది. ఎకరానికి రూ.లక్షన్నర వరకూ ధర వచ్చింది. ఈ ఏడాది అదేస్థాయిలో వస్తుందని ఆశిస్తున్నా.
మడకం జంపాలు, రైతు, దాసియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం
మన్యంలో 27 ఎకరాల్లో జాఫ్రా సాగు
ఒక్కసారి నాటితే 25 ఏళ్ల వరకు దిగుబడి
9 నెలల్లోనే చేతికొస్తున్న పంట
క్వింటాకు రూ.60 వేల ధర
లిప్‌స్టిక్ పంటకు గిరాకీ
లిప్‌స్టిక్ పంటకు గిరాకీ


