పాము కాటు మరణంపై విచారణ
కలిదిండి(కై కలూరు): ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య మరణించిందని కలెక్టర్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై వైద్యాధికారులు కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం విచారణ చేపట్టారు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో అక్టోబరు 30న సిద్దాబత్తుల విజయ(32) దుకాణ ప్రిజ్‌లో పాలప్యాకెట్ విక్రయానికి తీస్తుండగా కింద నక్కిన నాగుపాము కాటు వేసింది. విషయాన్ని భర్త దుర్గారావుకు చెప్పడంతో కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, చివరకు ఏలూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సకాలంలో వైద్యం అందలేదనే దుర్గారావు ఫిర్యాదుతో వైద్యశాఖ జిల్లా ఫొగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ తన బృందంతో విచారణ చేశారు. దుర్గారావు మాట్లాడుతూ పాము కాటు నిమిత్తం తన భార్యను కలిదిండి పీహెచ్‌సీకి తీసుకువెళ్లినప్పుడు డాక్టర్ అందుబాటులో లేరన్నారు. నర్సు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి రెండు ఇంజక్షన్లు చేశారన్నారు. అక్కడ నుంచి కై కలూరు సీహెచ్‌సీకి వెళ్లామని, చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారన్నారు. అక్కడ తన భార్య మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వీడియో, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు వివరిస్తామని విచారణ బృందం తెలిపింది.
వ్యక్తిపై దాడి.. 15 మందిపై కేసు నమోదు
ఉండి: ఓ వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన ఆరేపల్లి శివనాగువెంకట సర్వేశ్వరరావు అనే వ్యక్తి బడ్డీకొట్టు, మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఆకివీడు గ్రామానికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి దుకాణానికి వచ్చి సిగరెట్ కావాలని అడిగాడు. ఈ విషయంలో ఇరువురి మద్య వాగ్వివాదం ఏర్పడింది. దీంతో జేమ్స్ మళ్లీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మరో 15 మందిని వెంటబెట్టుకుని వచ్చి షాపు ధ్వంసం చేసి, తనను, తన తల్లిని, కుమారుడిని, అతని వద్ద పనిచేస్తున్న పిల్లి దుర్గా వెంకటరావులను కొట్టినట్లు సర్వేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


