గుండెల నిండా గోవిందుడు
తరిస్తూ.. చినవెంకన్నను స్మరిస్తూ..
● అట్టహాసంగా శ్రీవారి గిరి ప్రదక్షిణ
● 30 వేల మందికి పైగా భక్తుల రాక
● మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ధర్మప్రచార రథం
రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న దేవస్థానం ఈఓ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు
ద్వారకాతిరుమల: భక్తవత్సలుడైన ఆ ఏడు కొండల వాడిపై గుండెల నిండి అపారమైన భక్తితో.. అచంచలమైన విశ్వాసంతో.. భక్తులు, గోవింద దీక్షాదారులు సోమవారం గిరి ప్రదక్షిణ చేశారు. ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహం నడుమ జరిగిన ఈ వేడుకతో ద్వారకాతిరుమల క్షేత్రం పులకించింది. తొలుత ఆలయ ప్రధాన కూడలి (గుడి సెంటర్)లో ప్రత్యేక రథంలో కొలువైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్ నివృతరావు పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆ రథం వెనుక విశేష పుష్పాలంకారాల్లో ఉన్న శ్రీవారి ధర్మప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. దాంతో గిరి ప్రదక్షిణ వేడుక ప్రారంభమైంది. గజ, వృషభ, అశ్వాలు ప్రచార రథం ముందు నడువగా, వాటి వెనుక భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు), రాళ్లకుంట, కొండపైన ఆశ్రమం, లింగయ్య చెరువు, ఉగాది మండపం మీదుగా సాగుతూ ఆలయానికి చేరుకుంది. సుమారు 5 కిలోమీటర్లు మేర 30 వేల మందికి పైబడిన భక్తులతో జరిగిన ఈ వేడుక చినవెంకన్న వైభవాన్ని చాటింది. శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ భక్తులు చేసిన గోవింద నామస్మరణలు క్షేత్ర పరిసరాల్లో మార్మోగాయి. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పండ్లు, టీలు, పాలు, ట్యాబ్లెట్లు, మంచి నీరు సక్రమంగా అందక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా ఈసారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.


