గిరిజనులపై దాడులు దుర్మార్గం
జంగారెడ్డిగూడెం: గిరిజనులపై దాడులు దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. ఇనుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు మొడియం నాగమణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజా రామారావు మాట్లాడారు. ఇనుమూరు గ్రామంలో మొత్తం 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతోపాటు గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్ననట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, దాడికి పాల్పడ్డ తహసీల్దార్, ఎస్సై, భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెంట్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వ్య.కా.స.జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, తెల్లం సంకురుడు, రైతు సంఘం, డీవైఎఫ్‌ఐ, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


