‘వందే భారత్’ రాక ఎప్పుడో?
నరసాపురం: ప్రస్తుతం విజయవాడ వరకూ నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించబోతున్నట్టు నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా నెలరోజుల క్రితం ప్రకటన చేశారు. దీంతో దసరా పండుగకు వందే భారత్ రైలు నరసాపురంలో ఆగుతుందని డెల్టా వాసులు ఎదురుచూశారు. అయితే దీపావళి దాటినా కూడా ఈ రైలు రాకపై రైల్వేశాఖ ఉలుకూపలుకూ లేకుండా ఉండటంతో ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులు, ప్రత్యేకంగా పశ్చిమడెల్టా ప్రజలు నిరాశలో ఉన్నారు. దసరారోజు నాటికి వందేభారత్ రైలు విజయవాడ నుంచి గుడివాడ, కై కలూరు, భీమవరం మీదుగా నరసాపురం వరకూ పొడిగించడం జరుగుతుందని కేంద్రమంత్రి ప్రకటించారు. మంత్రి ప్రకటన తరువాత రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం నరసాపురంలో పర్యటించి దసరారోజు నాటికి నరసాపురం వరకూ వందే భారత్‌రైలు పొడిగింపు జరుగుతుందని, ఇందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నడుపుతున్న వందే భారత్ రైలు సర్వీస్‌లు పశ్చిమడెల్టాలో అడుగుపెట్టబోతుందని ప్రజలు సంతోషించారు. ఇక అప్పటి నుంచి గోదావరి జిల్లాలో మొదటి సారిగా వందేభారత్ రైలు పరుగులు పెడుతుందని ఆశగా జనం ఎదురు చూస్తున్నారు. దసరా అన్నది దీపావళి పండుగకూడా దాటేసింది. కానీ ఇప్పటి వరకూ ఈ రైలు నరసాపురం రాకపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నరసాపురం–విజయవాడ మధ్య డబుల్‌లైన్, విద్యుదీకరణ పూర్తయ్యి మూడేళ్లు గడిచింది. ట్రాఫిక్ తగ్గడంతో ప్రస్తుతం ఈ రూట్‌లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడానికి సాంకేతికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మొత్తం విజయవాడ రైల్వే డివిజన్‌లోనే నరసాపురం–విజయవాడ రూట్ అత్యంత కీలకమైనది, డివిజన్‌కు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నది. మరి వందేభారత్ రైలు నరసాపురం పొడిగింపు విషయంలో రైల్వేశాఖ ఎందుకు ఆలస్యం చేస్తుందనే విషయం అంతుపట్టడంలేదు.
నరసాపురం వరకు పొడిగిస్తామని కేంద్ర మంత్రి ప్రకటన
నెలరోజులు దాటినా ఉలుకూపలుకూ లేని వైనం
వందే భారత్ రైలు రాక కోసం డెల్టా వాసుల ఎదురుచూపు


